
సాక్షి, హైదరాబాద్: ఆసియా రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ స్కేటర్లు పతకాల పంట పండించారు. దక్షిణ కొరియా వేదికగా ఇటీవల ముగిసిన ఈ టోర్నీలో... తెలంగాణ స్కేటర్లు గ్రూప్ స్వర్ణం సహా మొత్తంగా.... 16 పతకాలు సాధించారు. ఇందులో 9 స్వర్ణాలు, 6 రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి. గత రెండేళ్లుగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి టోర్నీల్లో రాణిస్తున్న యువ స్కేటర్లు... 20వ ఆసియా చాంపియన్‌షిప్‌లో పతకాలతో మెరిశారు.
శ్రియ మురళి, తేజేశ్ మూడేసి పతకాలు కైవసం చేసుకోగా... అనుపోజు కాంతిశ్రీ, రెండు పతకాలు ఖాతాలో వేసుకుంది. ఆకాంక్ష, జూహిత్, జయేశ్ పటేల్, రక్షిత్ మురళి, సంచిత్ చౌదరీ, ప్రతీక్, సౌరవ్ సింగ్ సీనియర్ విభాగంలో వ్యక్తిగత పతకాలు సాధించారు. జూనియర్ విభాగంలో కావ్యశ్రీ రజత పతకం నెగ్గింది. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు నెగ్గిన యువ స్కేటర్లను కోచ్ అనూప్ కుమార్ యామ ప్రత్యేకంగా అభినందించాడు.
భారత్ తరఫున రోలర్ స్కేటింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణ పతకం సాధించిన ఏకైక స్కేటర్ అయిన అనూప్ దిశానిర్దేశంలో రాష్ట్ర యువ స్కేటర్లు పతకాలతో సత్తాచాటారని తెలంగాణ రోలర్ స్కేటింగ్ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.