
టీమిండియా ఆటగాళ్లు ‘బ్రాంకో టెస్టు’ (Bronco Test)లో భాగంగా చెమటలు గక్కారు. భారత జట్టు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియాన్ లీ రౌక్స్ (Adrian Le Roux) ఆధ్వర్యంలో కఠిన శ్రమకోరుస్తూ ప్రాక్టీస్ చేశారు. కాగా ఆటగాళ్ల ఫిట్‌నెస్ పరీక్ష కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవల బ్రాంకో టెస్టును ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.
1200 మీటర్ల పరుగు
సాధారణంగా రగ్బీ ఆటగాళ్లు ఏరోబిక్, కార్టియోవాస్క్యులర్ కెపాసిటీని పెంచుకునేందుకు ఈ టెస్టును ఉపయోగిస్తున్నారు. ఇందులో 0 మీటర్ల నుంచి మొదలు పెట్టి 60 మీ... పరిగెత్తి.. ఆ తర్వాత 0- 40 మీ.. 0-20 మీ. పరుగు తీయాలి. మొత్తంగా 240 మీటర్లను ఓ సెట్‌లో పూర్తి చేయాలి. మొత్తంగా ఐదు సెట్లను అంటే.. 1200 మీటర్లను ఆరు నిమిషాల్లో పూర్తి చేయాలి.
చెమటలు గక్కిన హార్దిక్.. పడబోయిన రింకూ
ఇక ఆసియా కప్-2025లో భాగంగా సెప్టెంబరు 14నాటి పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు టీమిండియా తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో మైదానంలోనే రౌక్స్.. ఆటగాళ్లకు బ్రాంకో టెస్టు నిర్వహించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ విడుదల చేసింది. హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా చెమటలు గక్కగా.. రింకూ కిందపడిపోబోయాడు. మిగతా ఆటగాళ్లు సైతం పరుగు పూర్తి చేసేందుకు తీవ్రంగా కష్టపడ్డారు.
ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినా
ఈ విషయం గురించి రౌక్స్ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మేము బ్రాంకో టెస్టు రన్ చేశాము. ఇదేమీ కొత్త రకం పరీక్ష కాదు. వివిధ క్రీడల్లో ఇప్పటికే చాలా ఏళ్లుగా దీనిని వాడుతున్నారు.
ఇదొక ఫీల్డ్ టెస్టు. ఎక్కడైనా దీనిని నిర్వహించవచ్చు. ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినా మేము దీనిని ఉపయోగించుకోవచ్చు. ట్రెయినింగ్ పరంగా.. ఆటగాళ్ల శారీరక దృఢత్వాన్ని పరీక్షించేందుకు .. ఇలా రెండు విధాలుగా ఇది ఉపయోగపడుతుంది.
శారీరకంగా బలంగా ఉంటేనే..
ఆటగాళ్ల ఏరోబిక్ ఫిట్‌నెస్ పెంచుకోవడానికి సహకరిస్తుంది. క్రికెట్ నైపుణ్యాలతో కూడిన ఆట. అయితే, ఆటగాళ్లు పూర్తి ఫిట్‌గా ఉన్నపుడే వారి కెరీర్‌సుదర్ఘీ కాలం కొనసాగుతుంది. శారీరకంగా బలంగా ఉన్నపుడే అన్ని రకాల సవాళ్లకు ఆటగాళ్లు సిద్ధం కాగలుగుతారు. మా ఆటగాళ్లు అద్బుతం. వారి హార్డ్‌వర్క్‌తో నన్నెంతగానో ఆకట్టుకుంటున్నారు.
నేను గతంలో ఐపీఎల్ జట్లతో పనిచేశాను. ఎంతో మంది ఆటగాళ్లను చూశాను. ఇప్పుడిది నాకు కొత్త జట్టే. అయినా.. గతంలో ఇక్కడ పనిచేసిన అనుభవం నాకు ఉంది. ఇలాంటి పోరాట పటిమ ఉన్న జట్టుతో కలిసి ఉండటం గర్వంగా ఉంది’’ అని జట్టు పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.
చదవండి: 21 సార్లు డకౌట్ అయినా సరే.. జట్టులోనే.. అతడికి గంభీర్ చెప్పిందిదే..