India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆ యువ ఆటగాడే.. ఎందుకంటే...

Sunil Gavaskar Would Like To See Rishabh Pant As India Captain For This Reason - Sakshi

Who Will Be India Next Captain: టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో  టీమిండియా సారథిగా విరాట్‌ కోహ్లి ప్రస్థానం ముగిసింది. 68 టెస్టులకు సారథ్యం వహించి 40 మ్యాచ్‌లు గెలిపించిన రికార్డు కోహ్లిది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ వంటి విదేశీ గడ్డల మీద అద్భుత విజయాలతో భారత టెస్టు క్రికెట్‌ను మరో మెట్టుకు తీసుకువెళ్లిన ఘనత అతడిది. విజయాల శాతం 58.82. మరి ఇంతటి విజయవంతమైన కెప్టెన్‌గా పేరొందిన కోహ్లి స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారన్న అంశం ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఇప్పటికే పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా నియమితుడైన రోహిత్‌ శర్మకే టెస్టు పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని చాలా మంది భావిస్తున్నారు. కానీ... టీమిండియా మాజీ కెప్టెన్‌ సునిల్‌ గావస్కర్‌ మాత్రం వారితో ఏకీభవించడం లేదు. కోహ్లి వారసుడిగా యువ క్రికెటర్‌ పేరును సూచించాడు. ఈ మేరకు ఇండియా టు డే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘‘ఒకవేళ టీమిండియా తదుపరి కెప్టెన్‌ ఎవరని అడిగితే మాత్రం నేను రిషభ్‌ పంత్‌ పేరే చెబుతా. రిక్కీ పాంటింగ్‌ ముంబై ఇండియన్స్‌ సారథిగా తప్పుకున్నప్పుడు రోహిత్‌ శర్మకు కెప్టెన్సీ అప్పగించారు.

ఆ తర్వాత రోహిత్‌ బ్యాటింగ్‌ ఎలా మారిపోయిందో చూశాం కదా. కెప్టెన్‌గా బాధ్యతనను నెత్తికెత్తుకున్న తర్వాత 30, 40, 50(స్కోర్లు)లను సెంచరీలు, 150, 200లుగా మార్చాడు. రిషభ్‌ పంత్‌ కూడా అలాగే బాధ్యతలు స్వీకరిస్తే... మరింత బాగా రాణించగలుగుతాడని నా అభిప్రాయం. న్యూలాండ్స్‌లో అతడు బాధ్యతాయుతంగా ఆడి సెంచరీ చేయడం చూశాం కదా’’అని చెప్పుకొచ్చాడు.  ఇక కెప్టెన్సీకి వయసుతో సంబంధం లేదన్న గావస్కర్‌... ‘‘టైగర్‌ పటౌడీ 21 ఏళ్లకే కెప్టెన్‌ అయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతంగా రాణించారు.

పంత్‌ విషయంలోనూ ఇలాగే అనుకుంటున్నా. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను అతడు ముందుండి నడిపించిన విధానం చూశాం. శక్తిసామర్థ్యాలను గమనించాం. అదే తరహాలో అతడు భారత జట్టును ముందుకు నడిపిస్తాడని భావిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. కాగా 24 ఏళ్ల పంత్‌ ఐపీఎల్‌-2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను టేబుల్‌ టాపర్‌గా నిలిపిన సంగతి తెలిసిందే. అయితే, ఆ జట్టు ఫైనల్‌ చేరలేకపోయింది. 

చదవండి: Virat Kohli: కెప్టెన్సీ నుంచి తొలగిస్తారనే ఇలా ముందుగానే.. నాకిది అనుభవమే.. టీమిండియా మాజీ సారథి సంచలన వ్యాఖ్యలు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top