
బంగ్లాదేశ్ వెటరన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ పొట్టి క్రికెట్‌లో చారిత్రక మైలురాయిని తాకేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఈ ఫార్మాట్‌లో మరో వికెట్ తీస్తే 500 వికెట్ల అరుదైన మైలురాయిని తాకుతాడు. ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటివరకు కేవలం నలుగురు మాత్రమే ఈ ఘనత సాధించారు.
ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (658 వికెట్లు), విండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో (631), విండీస్ వెటరన్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ (590), సౌతాఫ్రికా వెటరన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ (549) టీ20ల్లో 500 వికెట్లు పూర్తి చేసుకున్నారు.
ప్రస్తుతం షకీబ్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆడుతున్నాడు. ఈ టోర్నీలో అతడు ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇవాళ (ఆగస్ట్ 21) జరిగిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ వికెట్ తీసి తన టీ20 వికెట్ల సంఖ్యను 499కి పెంచుకున్నాడు. ఆగస్ట్ 23న గయానా అమెజాన్ వారియర్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఓ వికెట్ తీస్తే 500 వికెట్ల క్లబ్‌లో చేరతాడు.
2006లో టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చిన షకీబ్ బంగ్లాదేశ్ జాతీయ జట్టుతో పాటు పదుల సంఖ్యలో ఫ్రాంచైజీలకు ఆడి 499 వికెట్లు (455 మ్యాచ్‌ల్లో) తీశాడు. ఇందులో 5 ఐదు వికెట్ల ప్రదర్శనలతో పాటు 12 నాలుగు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. ఈ ఫార్మాట్‌లో షకీబ్ అత్యుత్తమ గణాంకాలు 6/6గా ఉన్నాయి.
లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన షకీబ్‌కు ఈ ఫార్మాట్‌లో బ్యాటింగ్‌లోనూ మంచి ట్రాక్ రికార్డు ఉంది. 124 స్ట్రయిక్‌రేట్‌తో 33 హాఫ్ సెంచరీల సాయంతో 7541 పరుగులు చేసి, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో 48వ స్థానంలో ఉన్నాడు.
38 ఏళ్ల షకీబ్ ఇటీవలికాలంలో బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేకపోతున్నాడు. బౌలింగ్‌లోనూ అడపాదడపా ప్రదర్శనలే చేస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న సీపీఎల్‌లో అతడు 3 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసి కేవలం 31 పరుగులే చేశాడు. బౌలింగ్‌లో ఓ వికెట్ మాత్రమే పడగొట్టాడు. గత కొంతకాలంగా షకీబ్ జాతీయ జట్టుకు దూరంగా ఉంటూ ఫ్రాంచైజీ క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు.