 
													Rohit Is More Dangerous Than Kohli Says Mudassar Nazar: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాక్ జట్ల మధ్య అక్టోబర్ 24న జరుగనున్న మెగా పోరులో ఏ ఆటగాడు రాణిస్తాడు, ఏ జట్టు ప్రత్యర్ధిపై ఆధిపత్యం చలాయిస్తుందన్న ప్రశ్నలపై పాక్ మాజీ క్రికెటర్ ముదస్సర్ నాజర్ స్పందించాడు. ఈ విషయమై పాక్ ఆటగాళ్లు ఒక్కరి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అతన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని పెద్దగా పట్టించుకోవల్సిన అవసరం లేదని, అతని కంటే హిట్ మ్యాన్ రోహిత్ శర్మనే ప్రమాదకారిగా పరిగణించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
ఆ మ్యాచ్‌లో రోహిత్‌ను కట్టడి చేయగలిగితే.. విజయం పాక్‌దేనని జోస్యం చెప్పాడు. జట్ల బలాబలాల విషయానికొస్తే.. పాక్ కంటే టీమిండియా బలంగా ఉందని, అయితే తమదైన రోజున పాక్ బెబ్బులిలా విరుచుకుపడుతుందని, ఇది అక్టోబర్ 24న నిరూపితమవుతుందని గొప్పలు పోయాడు. ఇదిలా ఉంటే, అక్టోబర్ 17 నుంచి ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూప్ (గ్రూప్-2)లో తలపడనున్నాయి. సూపర్-12 స్టేజ్ మ్యాచ్‌లు అక్టోబర్ 23 నుంచి ప్రారంభం కానున్నాయి. దాయాది పోరు కోసం ఇరు దేశాల అభిమానులు సహా యావత్ క్రికెట్ ప్రపంచం ఆతృతగా ఎదురు చూస్తోంది. 
చదవండి: గంటల వ్యవధిలో ఇద్దరు ఆటగాళ్ల రిటైర్మెంట్ ప్రకటన

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
