Ranji Trophy- Yash Dhull: అరంగేట్రంలోనే అద్భుత సెంచరీ.. మరో కోహ్లివి.. మరీ 50 లక్షలు తక్కువే కదా!

Ranji Trophy 2022: Yash Dhull Hit Century In Ranji Trophy Debut Against TN - Sakshi

అండర్‌- 19 ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌కు ప్రపంచకప్‌ సాధించి పెట్టిన కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ కెరీర్‌ను ఘనంగా ఆరంభించాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి సత్తా చాటాడు. తద్వారా ఆడిన మొదటి రంజీ మ్యాచ్‌ను మరింత ప్రత్యేకంగా మార్చుకున్నాడు. కాగా కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తున్న దేశవాళీ రంజీ టోర్నీ రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు ఫిబ్రవరి 17న మొదలైంది. 

ఇందులో భాగంగా ఢిల్లీ, తమిళనాడు జట్లు మొదటి మ్యాచ్‌లో తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన తమిళనాడు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనింగ్‌కు దిగిన ఢిల్లీ బ్యాటర్‌ యశ్‌ ధుల్‌ 136 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 150 బంతులు ఎదుర్కొన్న అతడు 113 పరుగులు చేశాడు. ఇందులో 18 ఫోర్లు ఉన్నాయి. కాగా యశ్‌ ధుల్‌కు ఇదే మొదటి రంజీ మ్యాచ్‌ కావడం విశేషం. 

ఇక తమిళనాడు వంటి పటిష్ట జట్టుపై అరంగేట్ర మ్యాచ్‌లోనే ఇలా అదరగొట్టడంపై అభిమానులు ఫిదా అవుతున్నారు. యశ్‌ ధుల్‌ మరో కోహ్లి అవుతాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నీలాంటి అత్యుత్తమ ఆటగాడిని ఢిల్లీ క్యాపిటల్స్‌ లక్కీగా తక్కువ ధరకే సొంతం చేసుకుందని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్‌ మెగా వేలం-2022లో భాగంగా ఢిల్లీ ఫ్రాంఛైజీ 50 లక్షల రూపాయలు వెచ్చించి యశ్‌ ధుల్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 

చదవండి: Rohit Sharma- Ravi Bishnoi: అందుకే అతడిని జట్టులోకి తీసుకున్నాం.. అదరగొట్టాడు: రోహిత్‌ శర్మ ప్రశంసలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top