పంజాబ్ కింగ్స్ అత్య‌వ‌స‌ర స‌మావేశం.. అర్ష్‌దీప్‌పై వేటు! | IPL 2026, Arshdeep Singh Under Scrutiny After E-Cigarette Video Leak Controversy, Punjab Kings Hold Urgent Team Meeting | Sakshi
Sakshi News home page

పంజాబ్ కింగ్స్ అత్య‌వ‌స‌ర స‌మావేశం.. అర్ష్‌దీప్‌పై వేటు!

May 9 2026 6:52 PM | Updated on May 9 2026 9:45 PM

Punjab Kings-Hold Urgent Team Meeting Major Action For-Arshdeep Singh

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఊహించ‌ని సంఘ‌ట‌న‌లు చాలానే జ‌రుగుతున్నాయి. ఇటీవ‌లే రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కెప్టెన్ రియాన్ ప‌రాగ్‌తో పాటు పంజాబ్ కింగ్స్ ఆట‌గాడు య‌జ్వేంద్ర చాహ‌ల్ నిషేధిత ప్రాంతాల్లో ఈ-సిగ‌రేట్ తాగ‌డం పెను దుమారం రేపింది. ఇప్ప‌టికే ప‌రాగ్‌పై యాక్ష‌న్ తీసుకున్న బీసీసీఐ రూ. 25 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. 

అయితే చాహ‌ల్ విష‌యంలో బీసీసీఐ ఇంకా ఎలాంటి చ‌ర్య తీసుకోలేదు. ఎందుకంటే ఈ వివాదంలో చాహ‌ల్‌తో పాటు పంజాబ్ ఆట‌గాళ్లు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా అర్ష్‌దీప్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఈ వీడియో లీక‌వ్వ‌డం, అత‌డే వేప్ (ఈ-సిగ‌రేట్‌)ను చాహ‌ల్‌కు అందించ‌డం వీడియోలో క‌నిపించింది. తాజాగా ఈ వివాదానికి సంబంధించి ఒక కీల‌క అప్‌డేట్ బ‌య‌టికి వ‌చ్చింది. 

ఇప్ప‌టికే పంజాబ్ కింగ్స్ యాజ‌మాన్యం అర్ష్‌దీప్‌ను డ్రెస్సింగ్ రూమ్‌లో జ‌రిగే ప‌రిణామాల‌ను వ్లాగ్‌గా తీయ‌డం ఆపేయాల‌ని సూచించిన‌ట్లు తెలుస్తోంది. ఇలాంటి చ‌ర్యల వ‌ల్ల డ్రెస్సింగ్ రూమ్ వీడియోలు సోష‌ల్ మీడియాలో లీక్ అవుతున్నాయంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. తాజాగా శ‌నివారం ధర్మశాల స్టేడియంలో ప్రాక్టీస్‌ ముగిసిన అనంతరం పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ఆట‌గాళ్లంద‌రితో స‌మావేశ‌మైన‌ట్లు తెలిసింది. 

ఐపీఎల్ ముగిసేవ‌ర‌కు ఆట‌గాళ్లు వ్లాగ్ చేయ‌డం, దానిని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డాన్ని నిషేధిస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. అయితే ఈ మీటింగ్‌లో అర్ష్‌దీప్ హైలైట్‌ అయ్యాడు. చాహల్ చ‌ర్య‌కు ప‌రోక్షంగా అర్ష్‌దీప్ కార‌ణమ‌య్యాడు. కాగా అర్ష్‌దీప్‌కు ఇన్‌స్టాలో 6 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. 

మ‌రోసారి ఇలాంటి చ‌ర్య‌కు పాల్ప‌డితే జ‌ట్టు నుంచి నిషేధం ఎదుర్కోవాల్సి వ‌స్తోంద‌ని అర్ష్‌దీప్‌ను హెచ్చ‌రించిన‌ట్లు తెలుస్తోంది. ఈ-సిగరేట్‌ తాగిన చాహల్‌ను కూడా పంజాబ్‌ మందలించినట్లు సమాచారం. ఇక నుంచి పంజాబ్ కింగ్స్ అధికారిక సోష‌ల్ మీడియా ఖాతాలోనే ఆట‌గాళ్లంతా త‌మ వీడియోల‌ను షేర్ చేసుకోవాల‌ని ఆదేశించింది. అందుకు ఆట‌గాళ్లంద‌రి నుంచి ఇప్ప‌టికే సంత‌కాలు కూడా తీసుకోవడంతో పాటు ఏ ప్లేయర్‌ కూడా తమ వ్యక్తిగత అకౌంట్స్‌లో వీడియోలు పంచుకోవద్దని సూచించింది. 

ఇక పంజాబ్ కింగ్స్ ఈ సీజ‌న్‌లో తొలి అంచె పోటీల్లో వ‌రుస విజ‌యాల‌తో టేబుల్‌టాప‌ర్‌గా నిలిచింది. అయితే రెండో అంచె పోటీల్లో ప‌రాజ‌యాలు చ‌విచూసి ప్ర‌స్తుతం ప‌ట్టిక‌లో రెండో స్థానంలో కొన‌సాగుతోంది. పంజాబ్ కింగ్స్ త‌న తర్వాతి మ్యాచ్ ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో ఆడ‌నుంది.

చదవండి: అయ్యర్‌కు షాక్‌.. శాంసన్‌కు డబుల్‌ ప్రమోషన్‌!

Advertisement
 
Advertisement
Advertisement