టైటిల్‌ పోరుకు పుణేరి, హరియాణా 

Pro Kabaddi League final tomorrow - Sakshi

సెమీస్‌లో పట్నా, జైపూర్‌ ఓటమి 

రేపు ప్రొ కబడ్డీ లీగ్‌ ఫైనల్‌  

సాక్షి, హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) పదో సీజన్‌లో కొత్త చాంపియన్‌ ఖాయమైంది. నిరుటి రన్నరప్‌ పుణేరి పల్టన్‌తో అమీతుమీకి తొలిసారి ఫైనల్‌కు చేరిన హరియాణా స్టీలర్స్‌ సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య శుక్రవారం హైదరాబాద్‌లోనే ఫైన ల్‌ పోరు జరుగనుంది. సెమీఫైనల్స్‌లో ‘హ్యాట్రిక్‌’ టైటిళ్ల విజేత పట్నా పైరేట్స్, రెండు సార్లు చాంపియన్‌గా నిలిచిన జైపూర్‌ పింక్‌పాంథర్స్‌ ప్రత్యర్థుల చేతుల్లో పరాజయం చవిచూశాయి.

తొలి సెమీస్‌లో పుణేరి పల్టన్‌ ధాటికి 37–21తో టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటైన పట్నా పైరేట్స్‌ నిలువలేకపోయింది.  పుణేరి తరఫున కెపె్టన్, ఆల్‌రౌండర్‌ అస్లామ్‌ ముస్తఫా (7పాయింట్లు), రెయిడర్‌ పంకజ్‌ మోహితే (7) అదరగొట్టారు. మిగతా వారిలో మొహమ్మద్‌ రెజా చియనె 5, మోహిత్‌ గోయత్‌ 4, సంకేత్, అభినేశ్‌ చెరో 3 పాయింట్లు చేసి జట్టు విజయంలో భాగమయ్యారు.

పట్నా జట్టులో రెయిడర్‌ సచిన్‌ చేసిన 5 పాయింట్లే అత్యధిక స్కోరు! మిగిలిన వారిలో మన్‌జీత్, సుధాకర్‌ చెరో 4 పాయింట్లు చేశారు. అనంతరం హోరాహోరీగా జరిగిన రెండో సెమీ ఫైనల్లో హరియాణా స్టీలర్స్‌ 31–27తో డిఫెండింగ్‌ చాంపియన్‌ జైపూర్‌ పింక్‌పాంథర్స్‌ను కంగుతినిపించింది. స్టీలర్స్‌ రెయిడర్‌ వినయ్‌ 20 సార్లు కూతకు వెళ్లి 11 పాయింట్లు తెచ్చిపెట్టాడు. శివమ్‌ పతారే (7) కూడా అదరగొట్టాడు.

మిగతావారిలో ఆల్‌రౌండర్‌ ఆశిష్‌ 4, డిఫెండర్లు రాహుల్‌ సేథ్‌పాల్‌ 3, మోహిత్‌ 2 పాయింట్లు సాధించారు. జైపూర్‌ తరఫున రెయిడర్‌ అర్జున్‌ దేస్వాల్‌ (14) ఒంటరి పోరాటం చేశాడు. డిఫెండర్‌ రెజా మిర్బగెరి 4, భవానీ రాజ్‌పుత్‌ 3 పాయింట్లు చేశారు.  

whatsapp channel

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top