Paul Stirling: ఒక్క ఓవర్‌లో 34 పరుగులు.. అయినా మొహంలో చిరాకే!

Paul Stirling Smash 34 Runs Single Over But-Still Frustrated Viral - Sakshi

ఐర్లాండ్‌ స్టార్‌ బ్యాటర్‌ పాల్‌ స్టిర్లింగ్‌ టి20 క్రికెట్‌లో తాను ఎంత ప్రమాదకర ఆటగాడో మరోసారి రుచి చూపించాడు. ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న టి20 బ్లాస్ట్‌ టోర్నమెంట్‌లో పాల్‌ స్టిర్లింగ్‌ 51 బంతుల్లోనే 119 పరుగులు చేశాడు. స్టిర్లింగ్‌ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. బర్మింగ్‌హమ్‌ బేర్స్‌, నార్త్‌ హాంట్స్‌ మధ్య మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. కాగా స్టిర్లింగ్‌ ఇన్నింగ్స్‌లో హైలైట్‌ అయింది మాత్రం ఒకే ఓవర్‌లో 34 పరుగులు బాదడం. ఒక్క ఓవర్‌లో అన్ని పరుగులు బాదినప్పటికి పాల్‌ స్టిర్లింగ్‌ మొహంలో నవ్వు కంటే చిరాకే ఎక్కువగా కనిపించింది.

విషయంలోకి వెళితే.. జేమ్స్‌ సేల్స్‌ బౌలింగ్‌లో పాల్‌ స్టిర్లింగ్‌ వరుసగా 6,6,6,6,6,4 బాది మొత్తంగా 34 పరుగులు పిండుకున్నాడు. ఆ ఓవర్‌ మొత్తం జేమ్స్‌ సేల్స్‌ షార్ట్‌ బాల్స్‌ వేయగా.. తొలి ఐదు బంతులను సిక్సర్లుగా మలిచాడు. మరొక సిక్సర్‌ కొడితే ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించే అవకాశం వచ్చేది. కానీ స్టిర్లింగ్‌ తృటిలో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. జేమ్స్‌ సేల్స్‌ తన ఆరో బంతిని కూడా షార్ట్‌ బాల్‌ వేసినప్పటికి యాంగిల్‌ మారడం.. స్టిర్లింగ్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకి డీప్‌ థర్డ్‌మన్‌ దిశగా బౌండరీ వెళ్లింది.

దీంతో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టలేకపోయాననే బాధ పాల్‌ స్టిర్లింగ్‌ మొహంలో స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. టి20 క్రికెట్‌లో మూడో సెంచరీ అందుకున్న స్టిర్లింగ్‌ పనిలో పనిగా 7వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఐర్లాండ్‌ తరపున ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా పాల్‌ స్టిర్లింగ్‌ చరిత్ర సృష్టించాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. వర్షం అంతరాయం కలిగించడంతో 16 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన బర్మింగ్‌హమ్‌ బేర్స్‌ పాల్‌ స్టిర్లింగ్‌ దాటికి 3 వికెట్లు కోల్పోయి 207 పరుగుల భారీస్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన నార్త్‌ హంట్స్‌ 14.2 ఓవర్లలో 81 పరుగులకే కుప్పకూలింది.

చదవండి: RCB: మరో దక్షిణాఫ్రికాలా తయారైంది.. ఇంకా ఎన్నేళ్లు నిరీక్షించాలో!

Alastair Cook: 15 ఏళ్ల కుర్రాడి ముందు 12 ఏళ్ల అనుభవం పనికిరాలేదు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top