పాకిస్తాన్ పేసర్ మొహమ్మద్ అలీ టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్‌ను ‘ది గ్రేట్’గా అభివర్ణించాడు. ద్రవిడ్ చెప్పినట్లే కష్టపడే వాళ్లకు అదృష్టం కూడా కలిసి వస్తుందన్నాడు. తమ విషయంలోనూ ఇదే జరిగిందని హర్షం వ్యక్తం చేశాడు. అయితే, అనూహ్య రీతిలో అతడు జరిమానా బారిన పడ్డాడు. అసలు విషయమేమిటంటే..
అరంగేట్ర సీజన్‌లోనే
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) తుది అంకానికి చేరుకుంది. పెషావర్ జల్మీ తొలుత ఫైనల్ చేరగా.. తాజాగా హైదరాబాద్ కింగ్స్‌మన్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. కాగా హైదరాబాద్ జట్టు ఈ ఏడాదే పీఎస్‌ఎల్‌లో అరంగేట్రం చేసింది.
ఆరంభంలో వరుస ఓటములతో విమర్శలపాలైన హైదరాబాద్ జట్టు.. ఆ తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుని ప్లే ఆఫ్స్ చేరింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్‌ను శుక్రవారం ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. హైదరాబాద్ విజయాల్లో మొహమ్మద్ అలీది కీలక పాత్ర. ఇప్పటికి ఈ సీజన్‌లో అతడు పదిహేడు వికెట్లు కూల్చాడు.
ది గ్రేట్ రాహుల్ ద్రవిడ్ అన్నట్లుగా
ఇక ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు అలీ. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘ది గ్రేట్ రాహుల్ ద్రవిడ్ అన్నట్లుగా.. కష్టపడే వాళ్లకు అదృష్టం కూడా కచ్చితంగా కలిసి వస్తుంది’’ అని పేర్కొన్నాడు.
షాకిచ్చిన పీసీబీ
ఇదిలా ఉంటే.. అలీపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కఠిన చర్యలు చేపట్టింది. అతడి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది. ఇస్లామాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా అలీ.. ప్రత్యర్థి జట్టు బ్యాటర్ మార్క్ చాప్‌మన్‌తో గొడవపడటం ఇందుకు కారణం.
ఈ నేపథ్యంలో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద పీసీబీ ఈ మేరకు శిక్ష విధించింది. కాగా ఎలిమినేటర్-1లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ కింగ్స్‌మన్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో ఇస్లామాబాద్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి.. 184 పరుగులు చేసింది. దీంతో నరాలు తెగే ఉత్కంఠ పోరులో రెండు పరుగుల స్వల్ప తేడాతో హైదరాబాద్ గట్టెక్కి ఫైనల్‌కు దూసుకువెళ్లింది.


