
టీమిండియా చేతిలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు (IND vs PAK)కు మరోసారి పరాభవమే ఎదురైంది. ఆసియా కప్ టీ20 టోర్నీ-2025లో భాగంగా భారత్ చేతిలో సల్మాన్ ఆఘా బృందం ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరుదేశాలు ముఖాముఖి తలపడటం ఇదే మొదటిసారి.
ఈ నేపథ్యంలో తీవ్రమైన భావోద్వేగాల వ్యక్తీకరణల నడుమ భారత్- పాక్ మైదానంలో దిగాయి. ‘బాయ్‌కాట్’ ట్రెండ్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryalumar Yadav) ముందుగానే జాగ్రత్తపడ్డాడు. టాస్ సమయంలో పాక్ సారథి సల్మాన్ ఆఘా (Salman Agha)కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.
ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనానికి భారత ఆటగాళ్లు నిరాకరించారు. ఈ క్రమంలో పాక్ ప్లేయర్లు టీమిండియా డ్రెసింగ్‌రూమ్ వైపు వెళ్లగా.. సహాయక సిబ్బంది తలుపు మూసేసినట్లు తెలుస్తోంది.
అక్కడికి వెళ్లినా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు..
ఈ క్రమంలో అవమానభారంతో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌కు కూడా రాలేదు. ఈ విషయంపై పాక్ కోచ్ మైక్ హసన్ వివరణ ఇచ్చాడు. ‘‘ఏదో ఫ్లోలో అలా జరిగిపోయి ఉంటుందని అనుకున్నాం. వారితో కరచాలనం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ మా ప్రత్యర్థి జట్టు చేసిన పని మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది.
ఆ తర్వాత కూడా షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి వెళ్లాము. కానీ వాళ్లు అప్పటికే చేంజింగ్ రూమ్‌కి వెళ్లిపోయారు. నిజంగానే మేము కరచాలనానికి సిద్ధంగా ఉన్నా ఇలా జరగడం బాధ కలిగించింది’’ అని మైక్ హసన్ మీడియాతో పేర్కొన్నాడు.
ఆడుతూ.. పాడుతూ.. అలవోకగా..
కాగా దుబాయ్ వేదికగా భారత- పాక్ ఆదివారం తలపడ్డాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ (40), పేసర్ షాహిన్ ఆఫ్రిది (33) రాణించడంతో.. నిర్ణీత 20 ఓవర్ల ఆటలో తొమ్మిది వికెట్ల నష్టానికి 127 పరుగులు చేయగలిగింది.
భారత బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లతో చెలరేగగా.. అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలకు చెరో ఒక వికెట్ దక్కింది.
ఇక లక్ష్య ఛేదనను టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. 15.4 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 131 పరుగులు చేసింది. ఫలితంగా దాయాదిపై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. పాక్ స్పెషలిస్టు బౌలర్లంతా విఫలం కాగా.. పార్ట్‌టైమ్ స్పిన్నర్ సయీమ్ ఆయుబ్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

చదవండి: పాక్ జట్టుకు ఘోర అవమానం!?.. అలాంటివాళ్లకు గంభీర్ కరెక్ట్!
Trick after trick, Pakistan fell for Kuldeep's magic show 🪄
Watch the #DPWorldAsiaCup2025, from Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/F5lOWqPrvK— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025