Pak Vs Aus 2nd Test: బాబర్‌ ఆజమ్‌ సెంచరీ.. సూపర్‌ అంటూ అశ్విన్‌ ట్వీట్‌

Pak Vs Aus 2nd Test: Babar Azam Hits Century Main Hoon Na Celebration - Sakshi

పోరాడుతున్న పాకిస్తాన్‌

Pak Vs Aus 2nd Test- కరాచీ: ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో పాకిస్తాన్‌ విజయలక్ష్యం 506 పరుగులు...రెండు రోజులు కలిపి కనీసం 172 ఓవర్ల ఆట మిగిలి ఉంది...తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఆటతీరును చూస్తే మంగళవారమే ఆసీస్‌ విజయం ఖాయమనిపించింది. కానీ పాక్‌ ఇంకా పోరాడుతోంది. మ్యాచ్‌ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి పాక్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.

కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (197 బంతుల్లో 102 బ్యాటింగ్‌; 12 ఫోర్లు) కీలక దశలో చక్కటి సెంచరీ సాధించగా, అబ్దుల్లా షఫీఖ్‌ (226 బంతుల్లో 71 బ్యాటింగ్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అండగా నిలిచాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు అభేద్యంగా 171 పరుగులు జోడించారు. బుధవారం మ్యాచ్‌కు చివరి రోజు కాగా...పాక్‌ మిగిలిన 314 పరుగులు సాధించి లక్ష్యాన్ని అందుకుంటుందా లేక ఆసీస్‌ బౌలర్లు ప్రత్యర్థిని పడగొడతారా చూడాలి.

గెలుపు సాధ్యం కాదనుకుంటే పాక్‌ చివరి 8 వికెట్లు కాపాడుకుంటూ ‘డ్రా’ కోసం ప్రయత్నించే అవకాశం కూడా ఉంది. అంతకు ముందు ఓవర్‌నైట్‌ స్కోరు 81/1తో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా, మరో 16 పరుగుల తర్వాత మార్నస్‌ లబుషేన్‌ (44) అవుట్‌ కాగానే 2 వికెట్లకు 97 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ఉస్మాన్‌ ఖాజా (44 నాటౌట్‌) అజేయంగా నిలిచాడు.

కాగా సెంచరీ అనంతరం కష్టాల్లో ఉన్న జట్టును ఉద్దేశించి మై హూనా(నేనున్నా కదా) అన్నట్లుగా బాబర్‌ సెలబ్రేట్‌ చేసుకున్నాడు. ఇక బాబర్‌ ఆజమ్‌ ఇన్నింగ్స్‌పై టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ట్విటర్‌ వేదికగా స్పందించాడు. నువ్వు అందించబోయే రేపటి అద్భుత ఫినిషింగ్‌ కోసం ఎదురుచూస్తున్నా అంటూ ప్రశంసించడం విశేషం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top