
భారత క్రికెట్ జట్టు మెంటార్‌గా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని మరోసారి నియమించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి.. ఇప్పటికే భారత క్రికెట్ బోర్డు ధోనితో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. కానీ ధోని ఇంకా తన అభిప్రాయాన్ని తెలియజేయలేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
కాగా ఈ జార్ఖండ్ డైనమేట్ టీ20 ప్రపంచకప్-2021లో అప్పటి హెడ్‌కోచ్ రవిశాస్త్రితో కలిసి భారత జట్టు మెంటార్‌గా ధోని పనిచేశాడు. అయితే మళ్లీ ఇప్పుడు అతడు అనుభవాన్ని ఉపయోగించుకోవాలని బీసీసీఐ భావిస్తుందంట. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ధోనిని సంప్రదించడం చాలా కష్టమని, అతడు నిజంగా బీసీసీఐ ఫోన్ కాల్‌కు స్పందించాడా అని? ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కాగా ధోనిపై చాలా రోజుల నుంచి తివారీ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ధోని తనకు అన్యాయం చేశాడని, అతడి వల్లే తన అంతర్జాతీయ కెరీర్ ముగిసిపోయిందని పదేపదే తివారీ ఆరోపిస్తూ వస్తున్నాడు.
"ఆటగాడిగా, కెప్టెన్‌గా ధోనికి అపారమైన అనుభవం ఉంది. అటువంటి వ్యక్తి టీమిండియాకు మెంటార్‌గా వస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. యువ ఆటగాళ్లను స్టార్లగా తీరిదిద్దడంలో అతడు కీలక పాత్ర పోషిస్తాడు. అయితే అతడికి నిజంగా బీసీసీఐ ఆఫర్ ఇచ్చిందో లేదో త్వరలోనే తెలుస్తోంది.
కానీ అతడు బోర్డ్ ఫోన్ కాల్‌కు స్పందించాండంటే నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే అతన్ని ఫోన్‌లో సంప్రదించడం కష్టం. మెసేజ్‌లకు కూడా ధోని రిప్లే ఇవ్వడం చాలా అరుదు. ఈ విషయం ఇప్పటికే చాలా మంది చెప్పారు.
మనం పంపిన మెసేజ్‌ను కూడా అతడు చదువుతాడా లేదో కూడా తెలియదు. ఏదేమైనప్పటికి అతడు మెంటార్ వస్తే జట్టుకు మేలు జరుగుతందని నేను అనుకుంటున్నాను. ధోని, గౌతమ్ గంభీర్ జోడీ అద్బుతాలు చేయవచ్చు" అని ఎఎన్ఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తివారీ పేర్కొన్నాడు. ఒకవేళ బీసీసీఐ ఆఫర్‌ను ధోని అంగీకరిస్తే టీ 20 ప్రపంచకప్-2026కు ముందే భారత జట్టు మెంటార్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశముంది.
చదవండి: DT 2025: అంకిత్, యశ్ ధుల్ సెంచరీలు.. భారీ ఆధిక్యంలో నార్త్ జోన్