మహిళా క్రికెట్‌: నీతా అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు

 Nita Ambani Reveals Massive Plan Behind Developing Women Cricket In India - Sakshi

సాక్షి, ముంబై: షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో విమెన్స్ టీ20 (మహిళల ఐపీఎల్)2020 టైటిల్ విజేతగా ట్రైల్ బ్లేజర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫైనల్‌మ్యాచ్‌కు ముందు రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్ నీతా అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫైనల్‌ పోరులో ఎవరు గెలిచినా ఆ విజయం ఎంతోమంది ఔత్సాహిక మహిళా క్రీడాకారిణులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆమె  భారతదేశంలో మహిళల క్రికెట్‌కు రానున్న రోజుల్లో మంచి  భవిష్యత్తు ఉంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి నీతా అంబానీ ఇన్‌స్టాలో సోమవారం ఒక  వీడియో పోస్ట్‌ చేశారు.

ప్రతి రంగంలో, ముఖ్యంగా క్రీడా, విద్యా రంగాల్లో మహిళలను ప్రోత్సహించాలని, వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నీతా పేర్కొన్నారు. ఇందుకు తమ ఫౌండేషన్‌ తరపున బాలికలు అందరికీ విద్య, క్రీడా అవకాశాలు అందించాలనేదే తన ధ్యేయమని చెప్పారు. మౌలిక వసతులు, సదుపాయాలతోపాటు, అవకాశాలు,  నైపుణ్య  శిక్షణ అవసరమన్నారు. ఈ విషయంలో తమ ఫౌండేషన్‌ చాలా కృషి చేస్తోందని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో దేశానికి  33 మందితోపాటు, 12 మంది విదేశీ మహిళా క్రికెటర్లు జియో విమెన్‌​ 2020లో  పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అలాగే తొలిసారి థాయ్‌లాండ్‌ నుంచి నాథకాన్‌(24) పాల్గొంటున్నారని  నీతా అంబానీ తెలిపారు. 

క్రీడల్లో బాలికల ప్రోత్సాహం కోసం నవీముంబైలో ఒక జియో క్రికెట్‌ స్టేడియాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. అమ్మాయిలకు సరైన అవకాశాలు కల్పిస్తే, గ్లోబల్‌గా రాణిస్తారనే విషయాన్ని మరోసారి నిరూపించారని నీతా ప్రశంసించారు. టీమిండియా మహిళల క్రికెట్‌ జట్టు  అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అద్భుతంగా రాణిస్తోందన్నారు. గత ఆరేళ్లుగా అంజుం చోప్పా, జులన్‌గోస్వామి, మిథాలీ రాజ్‌లాంటి లెజెండ్లు మంచి పేరు సంపాదించారన్నారు. అలాగే స్మృతి మంధన, పూనం యాదవ్‌, హర్మన్ ప్రీత్‌కౌర్‌ మన మహిళా క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళుతున్నారని చెప్పారు. భవిష్యత్తులోమరింత రాణించనున్నారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా  డిఫెండింగ్ ఛాంపియన్ సూపర్‌నోవాస్‌ను ఓడించి మూడేళ్లలో తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది ట్రైల్ బ్లేజర్స్. జియో అండ్ రిలయన్స్ ఫౌండేషన్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ మహిళల టి 20 ఛాలెంజ్‌ను స్పాన్సర్‌గా  వ్యవహరించిన సంగతి తెలిసిందే. 

Election 2024

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top