సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు 16.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. ఓపెనర్ టామ్ లాథమ్ (55 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) యాంకర్ రోల్ పోషించాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే (39) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ప్రొటీస్ బ్యాటర్లలో టెయిలెండర్ కొబాని మొకినా (26 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా, జార్జ్ లిండే (23) పర్వాలేదనిపించాడు. అయితే సౌతాఫ్రికా టాపార్డర్, మిడిలార్డర్ పూర్తిగా విఫలం కావడంతో సఫారీలు సాధారణ స్కోరుకే పరిమితమయ్యారు. కివీస్ బౌలర్లలో కైల్ జేమీసన్, మిచెల్ సాంట్నర్, బెన్ సియర్స్ తలా 2 వికెట్లు పడగొట్టారు.
అయితే తొలి రెండు టీ20 మ్యాచ్‌లతో పోలిస్తే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఛేదనలో స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. కాన్వే, టామ్ లాథమ్‌లు తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించి గట్టి పునాది వేశారు. ఆ తర్వాత కాన్వే ఔటైనా లాథమ్ చివరి వరకు నిలిచి జట్టుకు స్పష్టమైన విజయాన్ని అందించాడు. పొదుపుగా బౌలింగ్ చేసిన లోకీ ఫెర్గూసన్‌ను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది.
ఈ మ్యాచ్ విజయంతో న్యూజిలాండ్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ఆదివారం జరగనుంది.


