అయ్యో బ్రాత్‌వైట్‌.. రెండుసార్లు నువ్వేనా | Kraigg Brathwiate common 500 Wicket For Stuart Broad And James Anderson | Sakshi
Sakshi News home page

అయ్యో బ్రాత్‌వైట్‌.. రెండుసార్లు నువ్వేనా

Jul 28 2020 6:46 PM | Updated on Jul 28 2020 7:05 PM

Kraigg Brathwiate common 500 Wicket For Stuart Broad And James Anderson - Sakshi

మాంచెస్టర్‌ : ఇంగ్లండ్‌ సీనియర్‌ ఫాస్ట్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ టెస్టుల్లో 500వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మాంచెస్టర్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో మంగళవారం ఐదో రోజు ఆటలో భాగంగా క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ను ఔట్‌ చేసి ఈ ఘనతను సాధించాడు. కాగా క్రికెట్‌ ప్రపంచంలో 500 వికెట్లు తీసిన 7వ బౌలర్‌గా నిలవడంతో పాటు ఈ రికార్డును సాధించిన ఫాస్ట్‌ బౌలర్లలో నాలుగో ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు జేమ్స్‌ అండర్సన్‌(589), గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ (563), కౌట్నీ వాల్ష్‌( 519) వరుసగా ఉన్నారు. కాగా ఇప్పటివరకు ఇంగ్లండ్‌ తరపున 140 టెస్టుల్లో 500 వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా బ్రాడ్‌ నిలిచాడు. కాగా ఈ ఘనత సాధించిన ఇంగ్లీష్‌ మొదటి బౌలర్‌గా జేమ్స్‌ అండర్సన్‌ నిలిచాడు. (ఆల్‌టైమ్‌ గ్రేట్‌లలో వారు కూడా..)

అంతేగాక టెస్టుల్లో 500 వికెట్లు తీసిన ఇద్దరు ఆటగాళ్లు ఒకే జట్టులో ఒకే మ్యాచ్‌లో ఉండడం విశేషం. అంతేగాక యాదృశ్చికంగా జేమ్స్‌ అండర్సన్‌ 500వ వికెట్‌, బ్రాడ్‌ 500వ వికెట్‌గా విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ లభించడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. ఒక బౌలర్‌ తన మైల్‌స్టోన్‌ వికెట్‌ను సాధించడంలో బ్రాత్‌వైట్‌ మూడు సార్లు బలయ్యాడు. లార్డ్స్‌ వేదికగా 2017లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అండర్సన్‌(500 వ) వికెట్‌, అదే ఏడాది సెడాన్‌పార్క్‌లో కివీస్‌తో జరిగిన టెస్టులో ట్రెంట్‌ బౌల్ట్‌( 200వ) వికెట్‌తో పాటు తాజాగా బ్రాడ్‌ తన 500వ వికెట్‌ మైలురాయిని బ్రాత్‌వైట్‌ను ఔట్‌ చేసి సాధించడం విశేషం. కాగా  టెస్టుల్లో బౌలర్లు మైల్‌స్టోన్‌ అందుకోవడంలో అంతకుముందు దక్షిణాఫ్రికా మాజీ స్టార్‌ ఆల్‌రౌండర్‌ జాక్‌ కలిస్‌ ఐదుసార్లు ఔటయ్యాడు. వారిలో వరుసగా అండర్సన్‌( 100వ), ఆండీ కాడిక్‌(100వ), షేన్‌ వార్న్‌ (300వ), జహీర్‌ ఖాన్‌(300వ), వాల్ష్‌( 500వ) కలిస్‌ను ఔట్‌ చేసి మైలురాళ్లను సాధించారు. ఈ సందర్భంగా ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) ట్విటర్‌ వేదికగా బ్రాడ్‌ను ప్రశంసిస్తూ ఒక వీడియోను రిలీజ్‌ చేసింది. ఈ ఘనత సాధించిన వారిలో బ్రాడ్‌ ఉండడం మాకు గర్వంగా ఉంది అంటూ క్యాప్షన్‌ జత చేసింది.
('న‌న్ను ఎందుకు ప‌క్క‌న‌బెట్టారో అర్థం కాలేదు')

కాగా విండీస్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో జట్టు మేనేజ్‌మెంట్‌ తనను పక్కన పెట్టడం పట్ల బ్రాడ్‌ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఫామ్‌లో ఉన్న తనను కాదని వేరొకరికి అవకాశం ఇవ్వడం తనను బాధకు గురి చేసిందని బ్రాడ్‌ పేర్కొన్నాడు. అయితే రెండో టెస్టుకు జట్టులోకి వచ్చిన బ్రాడ్‌ తన సత్తాను చాటాడు. రెండో మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఆరు కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. నిర్ణయాత్మకమైన మూడో టెస్టులో బ్రాడ్‌ మరింత రెచ్చిపోయాడు. మొదట బ్యాటింగ్‌ 45 బంతుల్లోనే 62 పరుగులు చేసి ఫాస్టెస్ట్‌ ఆఫ్‌ సెంచరీ నమోదు చేయగా.. బౌలింగ్‌లో 6 వికెట్లు తీసి 18వ సారి 5కంటే ఎక్కువ వికెట్లు తీసిన రికార్డు సాధించాడు. కాగా కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్రాడ్‌ రెండు వికెట్లు తీసి ఇప్పటికే 14 వికెట్లతో సిరీస్‌లో లీడింగ్‌ వికెట్‌టేకర్‌గా నిలిచాడు.('భవిష్యత్తులో ధావన్‌కు అవకాశం కష్టమే')

మరోవైపు కీలకమైన మూడో టెస్టులో 390 పరుగులు విజయలక్ష్యంతో ఐదో రోజు బరిలోకి దిగిన విండీస్‌ ఓటమి అంచున నిలిచింది. ఇప్పటికే 82 పరుగులకే 6 వికెట్లు కోల్పయి పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయింది. అయితే వరుణుడు అడ్డు తగలడంతో ఆటకు విరామం లభించింది. ఇంకా ఒక సెషన్‌ మిగిలే ఉండడంతో విండీస్‌ ఓటమి అంచుల్లో ఉంది. అయితే వర్షంతో చివరి సెషన్‌ తుడిచిపెట్టుకుపోతే మ్యాచ్‌ డ్రా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కరోనా విరామం తర్వాత జరుగుతున్న మొదటి టెస్టు సిరీస్‌లో ఇరు జట్లు ఒక్కో మ్యాచ్‌ను గెలుచుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement