నరైన్‌, రాణా దూకుడు..

KKR Set Target Of 195 Runs Against Delhi Capitals - Sakshi

అబుదాబి: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 195 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. నితీష్‌ రాణా(81; 53 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌), నరైన్‌(64; 32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) బ్యాట్‌ ఝుళిపించడంతో కేకేఆర్‌ భారీ స్కోరు చేసింది. టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫీల్డింగ్‌ తీసుకోవడంతో కేకేఆర్‌ బ్యాటింగ్‌కు దిగింది. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ను శుబ్‌మన్‌ గిల్‌, నితీష్‌ రాణాలు ఆరంభించారు. అయితే నోర్జే వేసిన రెండో ఓవర్‌ ఐదో బంతికి గిల్‌(9; 8 బంతుల్లో 2 ఫోర్లు) ఔటయ్యాడు. అక్షర్‌ పటేల్‌ క్యాచ్‌ పట్టడంతో గిల్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. కాసేపటికి ఫస్ట్‌డౌన్‌ ఆటగాడు రాహుల్‌ త్రిపాఠి(13; 12 బంతుల్లో 1ఫోర్‌)ను కూడా నోర్జే ఔట్‌ చేశాడు. సుమారు 150 కి.మీ వేగంతో మిడిల్‌ స్టంప్‌ను టార్గెట్‌ చేస్తూ వేసిన బంతికి త్రిపాఠి వద్ద సమాధానం లేకుండా పోయింది. దాంతో 35 పరుగులకే కేకేఆర్‌ రెండో వికెట్‌ను నష్టపోయింది. (ధోని చెప్పింది నిజమే కదా.. ఇప్పుడేమంటారు!)

మరో ఏడు పరుగుల వ్యవధిలో దినేశ్‌ కార్తీక్‌(3) నిరాశపరిచాడు. రబడా వేసిన ఎనిమిదో ఓవర్‌ రెండో బంతికి పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి కార్తీక్‌ పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో ఓపెనర్‌ రాణాకు సునీల్‌ నరైన్‌ జత కలిశాడు. ఈ జోడి క్రీజ్‌లో కుదురుకున్నాక కేకేఆర్‌ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. నువ్వా-నేనా అన్నట్లు వీరు బ్యాటింగ్‌ కొనసాగించారు. వీరు మెరుపులతో కేకేఆర్‌ 15 ఓవర్లలో 142 పరుగులు చేసింది.  కాగా, నరైన్‌ 32 బంతుల్లో  6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 పరుగులు చేసి కేకేఆర్‌ విలువైన పరుగుల్ని అందించాడు. రాణాతో కలిసి 115 పరుగుల భాగస్వామ్యం జత చేసిన తర్వాత నరైన్‌ నాల్గో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. రబడా వేసిన 17 ఓవర్‌ నాల్గో బంతికి భారీ షాట్‌ ఆడబోయి క్యాచ్‌ ఔటయ్యాడు. ఆ తరువాత రాణా-మోర్గాన్‌ ద్వయం చెలరేగి ఆడింది. మోర్గాన్‌ 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో  17 పరుగులు చేశాడు. స్టోయినిస్‌ వేసిన ఆఖరి ఓవర్‌ చివరి రెండు బంతులకు రాణా, మోర్గాన్‌లు ఔట్‌ కావడంతో రెండొందల పరుగుల మార్కును కేకేఆర్‌ చేరలేకపోయింది. కేకేఆర్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.ఢిల్లీ బౌలర్లలో నోర్జే, రబడా, మార్కస్‌ స్టోయినిస్‌లు తలో  రెండు వికెట్లు సాధించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top