శభాష్‌ శ్రీకాంత్‌...

Kidambi Srikanth Beats Lakshya Sen In Thriller To Enter BWF World Championships 2021 Semi final - Sakshi

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్లోకి తెలుగు తేజం

పురుషుల సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు

సెమీస్‌లో లక్ష్య సేన్‌పై విజయం

ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ కిడాంబి శ్రీకాంత్‌ విశ్వకిరీటాన్ని అందుకునేందుకు విజయం దూరంలో నిలిచాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌లో బరిలోకి దిగిన ఈ తెలుగు తేజం అద్వితీయ ఆటతీరుతో ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

భారత్‌కే చెందిన యువతార లక్ష్య సేన్‌తో నువ్వా నేనా అన్నట్లు సాగిన సెమీఫైనల్‌ సమరంలో తుదకు అనుభవజ్ఞుడైన శ్రీకాంత్‌దే పైచేయిగా నిలిచింది. లక్ష్య సేన్‌ ఓడిపోయినప్పటికీ తన ఆటతీరుతో అందరి మనసులు గెల్చుకున్నాడు. ప్రకాశ్‌ పదుకొనే (1983), సాయిప్రణీత్‌ (2019) తర్వాత ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌ పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించిన మూడో భారతీయ క్రీడాకారుడిగా లక్ష్య సేన్‌ గుర్తింపు పొందాడు.

హుఎల్వా (స్పెయిన్‌): ఎవరూ ఊహించని విధంగా తొలిసారి ఇద్దరు భారతీయుల మధ్య జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్‌ అందర్నీ అలరించింది. 69 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ 17–21, 21–14, 21–17తో భారత్‌కే చెందిన యువతార లక్ష్య సేన్‌పై విజయం సాధించాడు. ఈ క్రమంలో ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల సింగిల్స్‌లో ఫైనల్‌ చేరిన తొలి భారతీయ క్రీడాకారుడిగా శ్రీకాంత్‌ ఘనత వహించాడు.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన 28 ఏళ్ల శ్రీకాంత్‌ గత నాలుగేళ్లుగా ఒక్క అంతర్జాతీయ టైటిల్‌ కూడా సాధించలేకపోయాడు. ఇప్పుడా లోటును తీర్చుకోవడానికి అతడు కేవలం విజయం దూరంలో  నిలిచాడు. ప్రపంచ మూడో ర్యాంకర్‌ ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌), ప్రపంచ 22వ ర్యాంకర్‌ లో కీన్‌ యె (సింగపూర్‌) మధ్య రెండో సెమీఫైనల్‌ విజేతతో నేడు జరిగే ఫైనల్లో శ్రీకాంత్‌ తలపడతాడు. భారత కాలమానం ప్రకారం పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ నేటి సాయంత్రం 5 గంటలకు మొదలయ్యే అవకాశముంది. అన్ని విభాగాల ఫైనల్స్‌ను స్టార్‌ స్పోర్ట్స్‌–3, హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

హోరాహోరీగా...  
అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి శ్రీకాంత్, లక్ష్య సేన్‌ తలపడగా... ప్రతీ పాయింట్‌కు ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. ముఖ్యంగా శ్రీకాంత్‌ కళ్లు చెదిరే రీతిలో స్మాష్‌లు సంధించాడు. అయితే శ్రీకాంత్‌ సంధించిన స్మాష్‌లకు అంతే చాణక్యంగా లక్ష్య సేన్‌ తిప్పి కొట్టాడు. 17 నిమిషాలపాటు జరిగిన తొలి గేమ్‌లో శ్రీకాంత్‌ అనవసర తప్పిదాలతోనే లక్ష్య సేన్‌ ఖాతాలో ఎక్కువ పాయింట్లు చేరాయి. బెంగళూరులోని ప్రకాశ్‌ పదుకొనే అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న ఉత్తరాఖండ్‌కు చెందిన 20 ఏళ్ల లక్ష్య సేన్‌ మ్యాచ్‌ కొనసాగుతున్నకొద్దీ అలసిపోయినట్లు కనిపించాడు.

రెండో గేమ్‌లో ఒకదశలో శ్రీకాంత్‌ 6–9తో వెనుకబడినా తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. డ్రాప్‌ షాట్‌లు, క్రాస్‌కోర్టు షాట్‌లతో చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు గెలిచిన శ్రీకాంత్‌ 12–9తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న శ్రీకాంత్‌ రెండో గేమ్‌ను 21 నిమిషాల్లో దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో ఇద్దరూ తమ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించారు.

ఈ క్రమంలో కొన్ని సుదీర్ఘ ర్యాలీలు కనిపించాయి. తుదకు ఈ సుదీర్ఘ ర్యాలీలకు కళ్లు చెదిరే షాట్‌లతో ముగింపు ఇస్తూ వీరిద్దరు తమ ఖాతాలో పాయింట్లు వేసుకున్నారు. చివరి గేమ్‌లో రెండుసార్లు శ్రీకాంత్‌ వెనుకంజ వేసినా వెంటనే తేరుకొని స్కోర్లను సమం చేశాడు. స్కోరు 16–16 వద్ద ఉన్నపుడు శ్రీకాంత్‌ వరుసగా మూడు పాయింట్లు గెలిచి 19–16తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఈ దశలో ఒత్తిడికి లోనైన లక్ష్య సేన్‌ అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. శ్రీకాంత్‌ రిటర్న్‌ షాట్‌ను లక్ష్య సేన్‌ నెట్‌కు కొట్టడంతో గేమ్‌తోపాటు మ్యాచ్‌ శ్రీకాంత్‌ వశమైంది.

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో సింగిల్స్‌ విభాగంలో ఫైనల్‌కు చేరిన మూడో భారతీయ ప్లేయర్‌ శ్రీకాంత్‌. గతంలో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు మూడుసార్లు (2017, 2018–రన్నరప్‌; 2019–విన్నర్‌), సైనా నెహ్వాల్‌ ఒకసారి (2015–రన్నరప్‌) ఫైనల్‌ చేరారు. పురుషుల సింగిల్స్‌లో మాత్రం భారత్‌ నుంచి ఫైనల్‌ చేరిన తొలి క్రీడాకారుడిగా శ్రీకాంత్‌ నిలిచాడు.
     
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top