సంజూ విధ్వంసం.. సీఎస్‌కే ఘన విజయం | IPL 2026: Chennai Super Kings Beat Delhi Capitals By 8 Wickets | Sakshi
Sakshi News home page

సంజూ విధ్వంసం.. సీఎస్‌కే ఘన విజయం

May 5 2026 11:13 PM | Updated on May 5 2026 11:31 PM

IPL 2026: Chennai Super Kings Beat Delhi Capitals By 8 Wickets

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ మరో విజయాన్ని అందుకుంది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 156 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్‌కే 17.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సంజూ శాంసన్ (87 నాటౌట్‌) విధ్వంసం సృష్టించగా.. కార్తిక్ శర్మ (41 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. 

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్, ఎన్గిడి చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 155 ప‌రుగులు చేసింది. స్ట‌బ్స్ (38), స‌మీర్ రిజ్వీ (40 నాటౌట్‌) కీల‌క ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్‌కే బౌల‌ర్లలో నూర్ అహ్మ‌ద్ రెండు వికెట్లు తీయ‌గా, అకిల్ హొసేన్‌, ముకేశ్ చౌద‌రీ, గుర్జ‌ప్‌నీత్ సింగ్‌, జేమీ ఓవ‌ర్ట‌న్‌లు త‌లా ఒక వికెట్ తీశారు. 

కాగా టాపార్డ‌ర్ వైఫ‌ల్యం ఢిల్లీ కొంప‌ముంచింది. సీఎస్‌కే బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో ఢిల్లీ క్ర‌మం త‌ప్ప‌కుండా వికెట్లు కోల్పోయింది. ఈ ద‌శ‌లో స్ట‌బ్స్‌, స‌మీర్ రిజ్వీ ఆరో వికెట్‌కు 65 ప‌రుగులు జోడించ‌డంతో ఢిల్లీ గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు సాధించింది.

సీఎస్‌కే ఆడుతూ పాడుతూ..
156 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్‌కే ఆడుతూ పాడుతూ లక్ష్యం దిశగా సాగింది. కెప్టెన్‌ రుతురాజ్‌, వన్‌డౌన్‌లో వచ్చిన ఉర్విల్ పటేల్‌ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. కానీ మరో ఎండ్‌లో ఓపెనర్ సంజూ శాంసన్ తన విధ్వంసాన్ని కొనసాగించాడు. అగ్నికి వాయువు తోడైనట్లు శాంసన్‌కు జత కలిసిన కార్తిక్ శర్మ తోడయ్యాడు. ఈ ఇద్దరు కలిసి ఫోర్లు, సిక్సర్లు బాది సీఎస్‌కేకు విజయాన్ని కట్టబెట్టారు. 

శాంసన్ సునామీ ఇన్నింగ్స్‌తో అలరిస్తే.. కార్తిక్ తన హిట్టింగ్‌ను ఢిల్లీ బౌలర్లకు రుచి చూపించాడు. ఈ సీజన్‌లో సీఎస్‌కేకు ఇది ఐదో విజయం కాగా పట్టికలో ఆరో స్థానంలో నిలిచి ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం 10 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, ఆరు ఓటములతో పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement