
వారం వాయిదా అనంతరం ఐపీఎల్ 2025 మే 17 నుండి పునఃప్రారంభం కానుంది. భారత ఆటగాళ్లంతా లీగ్ తదుపరి లెగ్ కోసం రెడీగా ఉండగా.. విదేశీ ఆటగాళ్ల పూర్తి లభ్యత ఇంకా డైలమాలో ఉంది. జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించాల్సి ఉండటంతో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్‌కు చెందిన ఆటగాళ్లు ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో విదేశీ ఆటగాళ్ల స్థానాల్లో తాత్కాలిక ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఐపీఎల్ గవర్నింగ్ బాడి అనుమతిచ్చింది.
బట్లర్ స్థానంలో బెయిర్‌స్టో..?
ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసులో ముందువరుసలో ఉన్న గుజరాత్ జోస్ బట్లర్ సేవలను లీగ్ దశ వరకే పొందగలుగుతుంది. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ జరిగే తేదీల్లో విండీస్‌తో వన్డే సిరీస్ షెడ్యూలై ఉండటంతో బట్లర్ ఆ మ్యాచ్‌లు ఆడేందుకు స్వదేశానికి వెళ్లిపోతాడు. అతని ప్రత్యామ్నాయ ఆటగాడిగా గుజరాత్ యాజమాన్యం జానీ బెయిర్‌స్టో పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ సీజన్ మెగా వేలంలో అమ్ముడుపోని బెయిర్‌స్టోకు ఐపీఎల్‌లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఐపీఎల్‌లో బెయిర్‌స్టో 50 ఇన్నింగ్స్‌ల్లో 144.45 స్ట్రయిక్‌రేట్‌తో 1589 పరుగులు చేశాడు. బెయిర్‌స్టో కూడా బట్లర్ లాగే వికెట్ కమ్ బ్యాటర్. బెయిర్‌స్టోకు బట్లర్‌లాగే మూడో స్థానంలో ఆడిన అనుభవం ఉంది. బెయిర్‌స్టో బట్లర్ లాగే సంయమనంతో బ్యాటింగ్ చేయడంతో పాటు మెరుపులు మెరిపించగలడు. కాబట్టి గుజరాత్ యాజమాన్యం బట్లర్‌కు సరైన ప్రత్యామ్నాయంగా బెయిర్‌స్టోను భావించవచ్చు.
హాజిల్‌వుడ్ స్థానంలో నవీన్..?
ప్రస్తుత సీజన్‌లో ప్లే ఆఫ్స్ రేసులో ముందున్న మరో జట్టు ఆర్సీబీ. ఈ సీజన్‌లో ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషించిన హాజిల్‌వుడ్ డబ్ల్యూటీసీ ఫైనల్ కారణంగా ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉండకపోవచ్చు. అతని స్థానాన్ని ఆర్సీబీ ఆఫ్ఘనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హాక్‌తో భర్తీ చేసే అవకాశం ఉంది.
ఈ సీజన్ మెగా వేలంలో అమ్ముడుపోని నవీన్ ఐపీఎల్‌లో 18 మ్యాచ్‌లు ఆడి 25 వికెట్లు తీశాడు. గత రెండు సీజన్లలో (2023, 2024) లక్నో తరఫున అద్బుతంగా రాణించిన నవీన్.. ప్లే ఆఫ్స్‌లో తమకు ఉపయోగపడగలడని ఆర్సీబీ భావించవచ్చు. నవీన్ పేరును విరాట్ కోహ్లి సిఫార్సు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గత సీజన్‌లో నవీన్, విరాట్ మధ్య చిన్నపాటి యుద్దం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయినా విరాట్ నవీన్ పేరును సిఫార్సు చేయడం ఆశ్చర్యంగా ఉంది.