చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్‌.. టీ20ల్లో టాప్‌ స్కోర్‌ | Sakshi
Sakshi News home page

IPL 2024 MI VS DC: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్‌.. టీ20ల్లో టాప్‌ స్కోర్‌

Published Sun, Apr 7 2024 6:18 PM

IPL 2024 MI VS DC: MUMBAI INDIANS SCORED THE HIGHEST T20 TOTAL IN HISTORY WITHOUT AN INDIVIDUAL FIFTY - Sakshi

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 7) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ చరిత్ర సృష్టించింది. టీ20ల్లో ఒక్క వ్యక్తిగత హాఫ్‌ సెంచరీ కూడా లేకుండా అత్యధిక టీమ్‌ స్కోర్‌ సాధించిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. 21 ఏళ్ల పొట్టి క్రికెట్‌ చరిత్రలో ఏ జట్టు కనీసం హాఫ్‌ సెంచరీ కూడా లేకుండా ఇంత భారీ స్కోర్‌ చేయలేదు. నేటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా లేకుండా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌కు ముందు టీ20ల్లో ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా లేకుండా అత్యధిక స్కోర్‌ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండింది. 2007లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా లేకుండా 221 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్‌ 48 (గిల్‌క్రిస్ట్‌). 

ఓవరాల్‌గా టీ20ల్లో అత్యధిక స్కోర్‌ రికార్డు నేపాల్‌ పేరిట ఉంది. ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో ఆ జట్టు మంగోలియాపై 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఐపీఎల్‌ విషయానికొస్తే.. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అత్యధిక టీమ్‌ స్కోర్‌ రికార్డు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేరిట ఉంది. ఆరెంజ్‌ ఆర్మీ ప్రస్తుత సీజన్‌లోనే ఈ రికార్డు తమ పేరిట లిఖించుకుంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ రికార్డు స్థాయిలో 277 పరుగులు స్కోర్‌ చేసింది. ఇదే సీజన్‌లో ఐపీఎల్‌లో రెండో భారీ స్కోర్‌ కూడా నమోదైంది. విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 272 పరుగులు స్కోర్‌ చేసింది. 

ఢిల్లీతో మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై.. రోహిత్‌ శర్మ (27 బంతుల్లో 49; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్‌ కిషన్‌ (23 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (33 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్‌), టిమ్‌ డేవిడ్‌ (21 బంతుల్లో 45 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రొమారియో షెపర్డ్‌ (10 బంతుల్లో 39 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. నోర్జే వేసిన ఆఖరి ఓవర్‌లో షెపర్డ్‌ విధ్వంసం సృష్టించాడు. 4 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేశాడు.

Advertisement
Advertisement