#Ravindra Jadeja: ఒక్క బంతి కూడా వేస్ట్‌ చేయలేదు... ఇది బాలేదు అని చెప్పడానికి ఏమీలేదు!

IPL 2023: Harbhajan Lauds Jadeja He Did Not Bowl Even One Bad Ball - Sakshi

IPL 2023 CSK Vs SRH: టీమిండియా ఆల్‌రౌండర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ రవీంద్ర జడేజాపై భారత మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ప్రశంసలు కురిపించాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్‌ చేశాడని, తన బౌలింగ్‌లో ఎలాంటి లోపాలు లేవని కొనియాడాడు. కాగా ఐపీఎల్‌-2023లో భాగంగా చెన్నైలోని చెపాక్‌ వేదికగా సీఎస్‌కే- ఎస్‌ఆర్‌హెచ్‌ మధ్య శుక్రవారం మ్యాచ్‌ జరిగింది.

అదరగొట్టిన బౌలర్లు
సొంతమైదానంలో టాస్‌ గెలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ జట్టును సీఎస్‌కే బౌలర్లు దెబ్బకొట్టారు. ఓపెనర్‌ హ్యారీ బ్రూక్‌(18)ను అవుట్‌ చేసి ఆకాశ్‌ సింగ్‌ బ్రేక్‌ ఇవ్వగా.. రవీంద్ర జడేజా.. అభిషేక్‌ శర్మ(34), రాహుల్‌ త్రిపాఠి(21), మయాంక్‌ అగర్వాల్‌(2) రూపంలో మూడు కీలక వికెట్లు తీశాడు. మహీశ్‌ తీక్షణ మార్కరమ్‌ వికెట్‌ తన ఖాతాలో వేసుకోగా.. మతీశ పతిరణ క్లాసెన్‌ను అవుట్‌ చేశాడు.

జడ్డూ సూపర్‌ స్పెల్‌
ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయిన సన్‌రైజర్స్‌ 134 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై 18.4 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 138 పరుగులు సాధించి గెలుపొందింది. 4 ఓవర్ల బౌలింగ్‌ కోటాలో 22 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి, జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించిన జడేజా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు గెలిచాడు.

ఒక్క బంతి కూడా వేస్ట్‌ చేయలేదు
ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం హర్భజన్‌ సింగ్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘ఈరోజు రవీంద్ర జడేజా కనీసం ఒక్క బంతి కూడా వేస్ట్‌ చేయలేదు. కచ్చితత్వం(లైన్‌ అండ్‌ లెంగ్త్‌ విషయంలో)తో బౌలింగ్‌ చేశాడు. తన బౌలింగ్‌లో పరుగులు రాబట్టాలంటే బ్యాటర్లు ఏదో ఒక ప్రయోగం చేయాల్సిన పరిస్థితి కల్పించాడు.

పరుగులు సాధించేందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా.. బ్యాటర్లను తన ట్రాప్‌లో పడేసి వికెట్లు పడగొట్టాడు’’ అని జడ్డూ ఆట తీరును భజ్జీ ప్రశంసించాడు. తన బౌలింగ్‌లో ఈ అంశం బాలేదని చెప్పడానికి ఏమీ లేదంటూ కొనియాడాడు. కాగా రైజర్స్‌తో మ్యాచ్‌లో మూడు వికెట్లతో మెరిసిన స్పిన్‌ ఆల్‌రౌండర్‌ జడేజాకు బ్యాటింగ్‌ చేయాల్సిన అవసరమే రాలేదు. 

సీఎస్‌కే వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌ స్కోర్లు
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- 134/7 (20)
చెన్నై సూపర్‌ కింగ్స్‌- 138/3 (18.4).

చదవండి: ఇదే నా చివరి ఐపీఎల్‌ కావొచ్చు.. అతడు అద్భుతం! నేను ఎప్పటికీ మర్చిపోను: ధోని
పేరుకే ఆల్‌రౌండర్‌.. జట్టులో ఎందుకు ఉన్నాడో తెలియదు! తీసి పడేయండి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top