IPL 2022: అతడికి అవకాశాలు రాలేదు.. మేము అండగా నిలబడ్డాం: పంత్‌

IPL 2022 KKR Vs DC: Rishabh Pant Says Backed Kuldeep He Is Doing Well - Sakshi

IPL 2022 KKR Vs DC- Rishabh Pant Comments: ఐపీఎల్‌-2022లో రెండు వరుస ఓటముల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ తిరిగి విజయాన్ని అందుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమిష్టిగా రాణించి గెలుపును సొంతం చేసుకుంది. తొలుత ఓపెనర్లు పృథ్వీ షా(51), డేవిడ్‌ వార్నర్(61) ఢిల్లీ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషిస్తే.. కుల్దీప్‌ యాదవ్‌ తన స్పిన్‌ మాయాజాలంతో కేకేఆర్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 

నాలుగు ఓవర్లలో 35 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ ముగ్గురితో పాటు మిగతా ఆటగాళ్లు కూడా రాణించడంతో కేకేఆర్‌ను ఢిల్లీ ఓడించింది. శ్రేయస్‌ అయ్యర్‌ బృందాన్ని 44 పరుగుల తేడాతో మట్టికరిపించింది. దీంతో వరుసగా రెండు ఓటముల తర్వాత తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. 

ఈ విజయంపై ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ హర్షం వ్యక్తం చేశాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘పవర్‌ప్లేలోనే ప్రత్యర్థిపై ఒత్తిడి పెట్టాలని భావించాం. అదే జరిగింది. ఆఖర్లో శార్దూల్‌(11 బంతుల్లో 29 పరుగులు) అద్భుతమైన ఫినిషింగ్‌ ఇచ్చాడు. నిజానికి మంచు ప్రభావం ఎక్కువ లేదు. ఇలాంటి సమయాల్లో 170-180 పరుగులు చేయడం చెప్పుకోదగ్గ స్కోరే! అయితే.. 200 దాటడం అంటే మామూలు విషయం కాదు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టుకు ఇది నిజంగా పెద్ద సవాలు లాంటిది. నిజానికి కుల్దీప్‌ గత సంవత్సర కాలంగా ఎంతో కష్టపడుతున్నాడు. కానీ అతడికి అవకాశాలు రావడం లేదు. ఇక్కడ(ఢిల్లీ జట్టులో) మేము అతడికి అండగా నిలబడ్డాం. తనకు మద్దతునిచ్చాం. ఇక ఈ విజయాన్ని ఇలాగే కొనసాగించాలనుకుంటున్నాం’’ అని పేర్కొన్నాడు. కాగా గత సీజన్‌లో కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహించిన కుల్దీప్‌నకు అవకాశాలు రాలేదు.

ఈ క్రమంలో తాజా మ్యాచ్‌లో కేకేఆర్‌పై విజయంలో కుల్దీప్‌ ప్రధాన పాత్ర పోషించిన నేపథ్యంలో పంత్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక సర్ఫరాజ్‌ ఖాన్‌ కంటే ముందు అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌ను బ్యాటింగ్‌కు పంపడానికి గల కారణాన్ని పంత్‌ ఈ సందర్భంగా వెల్లడించాడు.

‘‘ఒకవేళ మేము వరుసగా వికెట్లు కోల్పోయినట్లయితే ఆఖర్లో సర్ఫరాజ్‌ను పంపాలనుకున్నాం. అందుకే అతడి కంటే ముందు అక్షర్‌, శార్దూల్‌ను పంపాము. వ్యక్తిగతంగా, జట్టుగా మేమంతా రోజురోజుకీ మెరుగవుతున్నాం’’ అని పంత్‌ చెప్పుకొచ్చాడు. 

ఢిల్లీ క్యాపిటల్స్‌ వర్సెస్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌
టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైంది.
ఢిల్లీ క్యాపిటల్స్‌ స్కోరు: 215-5 (20)
కోల్‌కతా నైట్‌రైడర్స్‌: 171-10 (19.4 ఓవర్లు)
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: కుల్దీప్‌ యాదవ్‌

చదవండి: IPL 2022: స్టొయినిస్‌ ఆటలు సాగనివ్వని కుల్దీప్‌... లక్నో జోరుకు బ్రేక్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top