Daniel Sams: ఐపీఎల్‌ చరిత్రలోనే ఆసీస్‌ ఆటగాడి పేరిట అత్యంత చెత్త రికార్డు

IPL 2022: Daniel Sams Create Worst Record Bowling Average 242 IPL History - Sakshi

ఆస్ట్రేలియా ఆటగాడు.. ఆల్‌రౌండర్‌ డేనియల్‌ సామ్స్‌ బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో సూపర్‌ హిట్‌ ఆటగాడు. ఎంతలా అంటే ఒక నిఖార్సైన ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. బీబీఎల్‌లో 62 మ్యాచ్‌ల్లో 82 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లోనూ 622 పరుగులు చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 98 నాటౌట్‌. ఇంతమంచి రికార్డు కలిగిన ఆటగాడు ఐపీఎల్‌లో మాత్రం విఫలమయ్యాడు.  తాజాగా ఐపీఎల్‌ చరిత్రలోనే డేనియల్‌ సామ్స్‌ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం సామ్స్‌ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌లో అతని బౌలింగ్‌ యావరేజ్‌ ఎంతో తెలుసా.. అక్షరాలా 242.

అవును మీరు విన్నది నిజమే. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత చెత్త బౌలింగ్‌ యావరేజ్‌ కలిగిన ఆటగాడిగా  నిలిచాడు. ఇక డేనియల్‌ సామ్స్‌ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ద్వారా ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఆ సీజన్‌లో కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన సామ్స్‌ ఒక్క వికెట్‌ తీయలేకపోయాడు. ఆ తర్వాత ట్రేడింగ్‌లో ఆర్‌సీబీకి మారాడు. భారత్‌లో జరిగిన ఐపీఎల్‌ 2021 తొలి అంచె పోటీల్లో రెండు మ్యాచ్‌లు ఆడాడు. కోవిడ్‌ కారణంగా రద్దు కావడం.. ఆ తర్వాత యూఏఈ వేదికగా జరిగిన రెండో అంచె పోటీలకు దూరమయ్యాడు. ఆ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు కలిపి 6.50 ఎకానమీతో ఒక వికెట్‌ తీశాడు.

ఇక ఐపీఎల్‌ 2022 సీజన్‌ ఆరంభానికి ముందు నిర్వహించిన మెగావేలంలో డేనియల్‌ సామ్స్‌ను ముంబై ఇండియన్స్‌ రూ. 2.6 కోట్లకు దక్కించుకుంది. బీబీఎల్‌ రాణించడంతో అదే తరహా ప్రదర్శన చేస్తాడని ఆశిస్తే మరోసారి నిరాశపరిచాడు. సీజన్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన సామ్స్‌ 11.13 ఎకానమీ రేటుతో 89 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు.

ఓవరాల్‌గా మూడేళ్ల నుంచి చూసుకుంటే డేనియల్‌ సామ్స్‌ ఏడు మ్యాచ్‌ల్లో 26 ఓవర్లు బౌలింగ్‌ చేసి 242 బౌలింగ్‌ యావరేజ్‌తో కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే తీసి అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. అతని తర్వాతి స్థానంలో బరీందర్‌ శరణ​ 8 మ్యాచ్‌ల్లో 26 ఓవర్లు వేసి 70 బౌలింగ్‌ యావరేజ్‌తో 4 వికెట్లతో రెండో స్థానంలో ఉ‍న్నాడు. కాగా గతేడాది జరిగిన బీబీఎల్‌లో 14 పరుగులకే నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్న డేనియల్‌ సామ్స్‌ అదే ప్రదర్శనను ఇక్కడ మాత్రం చూపెట్టలేకపోతున్నాడు. రానున్న మ్యాచ్‌ల్లోనైనా కనీసం వికెట్లు తీసినా బాగుంటుందని అభిమానులు పేర్కొన్నారు.

చదవండి: సుందర్‌- ఎవిన్‌ లూయిస్‌ చిత్రమైన యుద్దం.. చివరికి

IPL 2022: ఆ ఆటగాడిని వెనక్కి పిలవండి.. లేదంటే సీఎస్‌కే పని అంతే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top