IPL 2022: చెన్నై, ముంబై వైఫల్యాలకు కారణం అదే: టీమిండియా మాజీ క్రికెటర్‌

IPL 2022: Ajay Jadeja Points Out Big Reason For MI CSK Failure - Sakshi

IPL 2022 CSK Vs MI: ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌.. ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లు. ముంబై ఐదుసార్లు చాంపియన్‌గా నిలిస్తే.. చెన్నై నాలుగు సార్లు ట్రోఫీ గెలుచుకుంది. అయితే, ఈ రెండు జట్లకు ఐపీఎల్‌-2022 సీజన్‌ ఏమాత్రం కలిసిరావడం లేదు. రవీంద్ర జడేజా సారథ్యంలోని సీఎస్‌కే కనీసం ఒక్క మ్యాచ్‌ అయినా గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉండగా.. రోహిత్‌ నేతృత్వంలోని ముంబై కనీసం ఖాతా కూడా తెరవలేక అట్టడుగున నిలిచింది. 

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్‌ అజయ్‌ జడేజా ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. ముంబై, చెన్నై వైఫల్యాలకు గల కారణాలు విశ్లేషించాడు. ఈ మేరకు క్రిక్‌బజ్‌తో అతడు మాట్లాడుతూ.. ‘‘ముంబై, చెన్నైకి టాపర్డర్‌ బౌలర్లు లేరు. అందుకే పాయింట్ల పట్టికలో ఆ జట్లు అట్టడుగున ఉన్నాయి. చెన్నై పెద్దగా మార్పులు చేయడం లేదు. ఇంకా బ్రేక్‌ కోసం ఎదురుచూస్తూనే ఉంది. మ్యాచ్‌ను మలుపు తిప్పగల ఫాస్ట్‌ బౌలర్‌ అవసరం వారికి ఉంది. 

ఇక సానుకూల అంశాలు అంటే.. రాబిన్‌ ఊతప్ప, అంబటి రాయుడు గత మ్యాచ్‌లో మెరుగ్గా రాణించారు. శివమ్‌ దూబే అదరగొట్టాడు. అయితే, రవీంద్ర జడేజాను కెప్టెన్‌ చేయడం అతడిని డౌన్‌ ఆర్డర్‌కు పంపడం పెద్దగా వర్కౌట్‌ కాలేదు. ఇక ముంబై విషయానికొస్తే.. వారికి సరైన బౌలర్లు లేరు’’ అని పేర్కొన్నాడు.

ముఖ్యంగా సరైన పేసర్లు లేకపోవడం ఇరు జట్లకు పెద్ద సమస్యగా మారిందని అభిప్రాయపడ్డాడు. కాగా ముంబైకి జస్‌ప్రీత్‌ బుమ్రా, టైమల్‌ మిల్స్‌ వంటి పేసర్లు ఉన్నారు. ఇక చెన్నైకి రిస్‌ జోర్డాన్‌, ముఖేశ్‌ చౌదరి, ప్రిటోరియస్‌, తుషార్‌ దేశ్‌పాండే వంటి బౌలర్లు ఉన్నా దీపక్‌ చహర్‌ దూరం కావడంతో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇక ఈ రెండు జట్లు గురువారం ముఖాముఖి తలపడబోతున్నాయి. ఈ క్రమంలో చెన్నై రెండో విజయం నమోదు చేస్తుందా? లేదంటే ముంబై బోణీ కొడుతుందా? అన్న అంశం ఆసక్తికరంగా మారింది.

చదవండి: IPL 2022: కుల్దీప్‌ క్రీడా స్ఫూర్తి.. ఈ అవార్డు అతడితో పంచుకుంటా.. క్రెడిట్‌ అంతా రిషభ్‌దే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top