బౌలర్‌ గీత దాటితే చర్య.. బ్యాట్స్‌మన్‌ దాటితే మాత్రం

IPL 2021: Venkatesh Prasad Reacts Bowler Penalised Not Batsman Overstepping - Sakshi

ముంబై: 2019 ఐపీఎల్‌ సీజన్‌లో అప్పటి కింగ్స్‌ పంజాబ్‌( పంజాబ్‌ కింగ్స్‌) బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ను మన్కడింగ్‌ ద్వారా ఔట్‌ చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. క్రికెట్‌ ప్రేమికులు రెండుగా చీలిపోయి.. అశ్విన్‌ చేసింది కరెక్టేనంటూ కొందరు సమర్థిస్తే.. మరికొందరు మాత్రం అశ్విన్‌ చర్య క్రీడాస్పూర్తికి విరుద్ధంగా ఉందంటూ పేర్కొన్నారు. కొన్నాళ్ల పాటు మన్కడింగ్‌ వివాదంపై సోషల్‌ మీడియాలోనూ పెద్ద డిబేట్‌ నడిచింది. తాజాగా సోమవారం సీఎస్‌కే, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌ వేయడానికి ముందే డ్వేన్‌ బ్రావో క్రీజు దాటి ముందుకు వెళ్లిపోయాడు.

వాస్తవానికి ఒక బౌలర్‌ బంతి విసిరేవరకు నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ క్రీజు విడిచే అవకాశం లేదు. అయితే అప్పటికే బ్రావో క్రీజును దాటేయడం.. ముస్తాఫిజుర్‌ బంతిని విసరడం జరిగింది. అయితే బౌలర్‌ వేసిన బంతి నోబాల్‌ అని తేలడంతో రూల్‌ ప్రకారం అవతలి జట్టుకు ఫ్రీ హిట్‌ ఆడే అవకాశం వచ్చింది. ఈ విషయం పక్కనపెడితే.. టీమిండియా మాజీ క్రికెటర్‌ వెంకటేష్‌ ప్రసాద్‌ బ్రావో, ముస్తాఫిజుర్‌ ఉన్న ఫోటోను తన ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు.

'ఒక బౌలర్‌ గీత దాతి బంతిని వేస్తే నోబాల్‌గా పరిగణించి అతనికి పెనాల్టీ విధిస్తారు. మరి అదే సమయంలో బౌలర్‌ బంతిని విడవకుండానే బ్యాట్స్‌మన్‌ క్రీజు దాటి వెళితే దానికి ఎలాంటి చర్యలు ఉండవా... అక్కడ బౌలర్‌కు మన్కడింగ్‌ చేసే అవకాశం ఉన్నా.. క్రీడాస్పూర్తికి విరుద్ధమని మీరే కామెంట్స్‌ చేస్తారు. అయితే మరి ఇలాంటి చర్యలకు పరిష్కారం చూపండి అంటూ  ఐసీసీనీ ట్యాగ్‌ చేస్తూ కామెంట్‌ చేశాడు. వెంకటేష్‌ ప్రసాద్‌ పెట్టిన  ఫోటో సోషల్‌  మీడియలో వైరల్‌గా మారింది.

కాగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేసింది. డు ప్లెసిస్‌ (17 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), అంబటి రాయుడు (17 బంతుల్లో 27; 3 సిక్స్‌లు), మొయిన్‌ అలీ (20 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) తలా ఓ చెయ్యి వేశారు. అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ను చెన్నై బౌలర్లు మొయిన్‌ అలీ (3/7), స్యామ్‌ కరన్‌ (2/24), రవీంద్ర జడేజా (2/28) కట్టడి చేశారు. ఫలితంగా రాజస్తాన్‌ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులకే పరిమితమై  ఓడిపోయింది. జోస్‌ బట్లర్‌ (35 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.  
చదవండి: ధోని బ్యాట్‌ నుంచి మరీ ఎక్కువ ఆశించకూడదు
ధోని వారసుడు అతడే.. తనే నెక్ట్స్ కెప్టెన్‌: మైకేల్‌ వాన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top