
Photo Courtesy: Delhi Capitals Twitter
అహ్మదాబాద్: కరోనా వైరస్ విజృంభణ కారణంగా భారత్ నుంచి విమానరాకపోకలను ఆస్ట్రేలియా ప్రభుత్వం నిలిపివేయడంపై ఆ దేశ మాజీ క్రికెట్ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందించాడు. ఇప్పటికే పలువురు ఆస్ట్రేలియా క్రికెటర్లు ఐపీఎల్ వీడి స్వదేశానికి బయల్దేరిన తరుణంలో ట్రావెల్ బ్యాన్‌పై చర్చనడుస్తోంది. దీనిపై మాట్లాడిన పాంటింగ్.. అదేమీ పెద్ద సమస్య కాదని అంటున్నాడు. భారత్ నుంచి విమానరాకపోకలను తమ దేశం నిలిపివేయడాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నాడు. అది చాలా చిన్న విషయమని, దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదన్నాడు.
తమ జట్టులోని విదేశీ ఆటగాళ్లు విమాన రాకపోకల నిషేధం అంశాన్ని మరీ ఎక్కువగా పట్టించుకోవడం లేదన్నాడు. కానీ భారత్‌లోని ప్రజలు పడుతున్న ఇబ్బందులే తమను తీవ్రంగా కలిచివేస్తున్నాయన్నాడు. తాము బయోబబుల్‌లో ఉన్నామని, భారత్‌లోని బయట పరిస్థితులే తీవ్రంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతీ రోజూ బారత్‌లో కరోనా కేసులు ఎక్కువ నమోదు కావడంం ఆందోళన పరుస్తుందన్నాడు. తమ జట్టులోని రవిచంద్రన్ అశ్విన్ తల్లిదండ్రులకు కరోనా సోకడంతో లీగ్‌ను వీడిన విషయాన్ని పాంటింగ్ ప్రస్తావించాడు. ఈ తరహా విపత్కర పరిస్థితులే తమను ఎక్కువ బాధిస్తున్నాయన్నాడు. ప్రస్తుత సమయంలో ఎవరైతే కోవిడ్-19తో బాధపడుతున్నారో వారి చుట్టే తమ మనసు తిరుగుతుందని, తమ ప్రయాణాల గురించి ఎటువంటి ఆందోళనా లేదన్నాడు.
భారత్‌లో కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చడంతో మనదేశ విమాన ప్రయాణాలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం మే 15వరకూ నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. అప్పటికి పరిస్థితులు చక్కబడితే తిరిగి విమానరాకపోకలకు మార్గం సుగుమం అవుతుంది. ఒకవేళ భారత్‌లో అప్పటికీ ఇదే పరిస్థితి ఉంటే మాత్రంం ఐపీఎల్‌లో ఉన్న ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ దేశాలకు వెళ్లడం కష్టతరం కావొచ్చు.
ఇక్కడ చదవండి: Virender Sehwag: పంత్ కెప్టెన్సీకి 5 మార్కులు కూడా ఇవ్వను