
Photo Courtesy:RCB Twitter
ముంబై: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన 178 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో జోస్ బట్లర్(8), వోహ్రా(7)లు విఫలం కాగా, సామ్సన్(21) కూడా నిరాశపరిచాడు. శివం దూబే(46), రాహుల్ తెవాతియా(40), రియాన్ పరాగ్(25)లు బ్యాట్ ఝుళిపించడంతో రాజస్థాన్ 177 పరుగులు చేసింది.
కాగా, ఆ తర్వాత లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆర్సీబీ 16.3 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా విజయం నమోదు చేసింది. కోహ్లి(72 నాటౌట్), దేవదూత్ పడిక్కల్(101 నాటౌట్)లు అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు. ఆర్సీబీ ఇన్నింగ్స్ ముగిసే సరికి బోర్డుపై 181 పరుగులు ఉండటంతో ఆ జట్టు కొత్త రికార్డును లిఖించింది.
ఇది ఆర్సీబీకి అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యంగా నమోదైంది. ఆర్సీబీ క్రికెట్ చరిత్రలో అంతకుముందు 2013లో క్రిస్ గేల్-దిల్షాన్‌లు నమోదు చేసిన 167 పరుగుల రికార్డును పడిక్కల్-కోహ్లిల జోడి సవరించింది. 2016లో గేల్-కోహ్లిలు కింగ్స్ పంజాబ్‌పై నమోదు చేసిన 147 పరుగుల భాగస్వామ్యం ఆర్సీబీ తరఫున మూడొ అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యంగా నిలిచింది. కాగా, ఓవరాల్‌గా వికెట్ పడకుండా అత్యధిక పరుగుల టార్గెట్‌ను చేజ్ చేసిన జాబితాలో కేకేఆర్ ఉంది. 2017లో గంభీర్-లిన్‌లు 184 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.