మెరిసేదెవరో? | Sakshi
Sakshi News home page

మెరిసేదెవరో?

Published Sat, Sep 26 2020 3:26 AM

IPL 2020: Sunrisers Hyderabad VS Kolkata Knight Riders Match On 26/10/2020 - Sakshi

అబుదాబి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)పై ఎన్నో ఆశలతో దుబాయ్‌ చేరిన జట్లు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌), కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌). తొలి మ్యాచ్‌లోనే గెలుపొంది ఘనంగా లీగ్‌ను ప్రారంభించాలనుకున్న ఈ రెండు జట్లనూ మొదటగా పరాజయమే పలకరించింది. ఇప్పుడు ఈ జట్లు ఒకదానితో మరొకటి తలపడేందుకు సిద్ధమయ్యాయి. శనివారం అబుదాబిలోని షేక్‌ జాయెద్‌ క్రికెట్‌ స్టేడియంలో జరుగనున్న ఈ మ్యాచ్‌లో కచ్చితంగా ఏదో ఒక జట్టు గెలవడం ఖాయం. అయితే తొలి విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరం.  

గాయాలతో సతమతం...: పేపర్‌ మీద పటిష్టంగా కనబడుతోన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మైదానానికి ఇంకా అలవాటు పడినట్లుగా లేదు. తొలి మ్యాచ్‌లో ఆటగాళ్ల రనౌట్లు, గాయాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. అభిమానులు బండెడు ఆశలు పెట్టుకున్న కెప్టెన్‌ వార్నర్‌ రనౌట్‌ దురదృష్టకరం. మ్యాచ్‌కు ముందు విలియమ్సన్‌ గాయపడగా, మైదానంలో  చీలమండ గాయంతో ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్‌‡్ష లీగ్‌ మొత్తానికే దూరం కావడం మరో దెబ్బ. బెయిర్‌స్టో, మనీశ్‌ పాండే పోరాడినా మిడిలార్డర్‌ వైఫల్యం రైజర్స్‌కు శాపంగా మారింది. అక్కడ అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనబడుతోంది. మ్యాచ్‌ను గెలిపించాల్సిన విజయ్‌ శంకర్‌ తొలి బంతికే వెనుదిరగ్గా... ప్రియమ్‌ గార్గ్‌ నిర్లక్ష్యంగా వికెట్ల పైకి ఆడుకున్నాడు. రషీద్‌ఖాన్‌తో సమన్వయ లోపంతో అభిషేక్‌ శర్మ రనౌట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు ఆర్‌సీబీతో మ్యాచ్‌లో తమ కోటా పూర్తి చేసుకున్న కీలక బౌలర్లు రషీద్‌ ఖాన్, భువనేశ్వర్‌ ఒక్క వికెట్‌ కూడా తీయకపోవడం గమనార్హం. సందీప్‌ శర్మ, నటరాజన్‌ పరవాలేదనిపించారు. మొత్తంగా చూస్తే తొలి మ్యాచ్‌లో రైజర్స్‌ తడబాటు స్పష్టంగా కనిపించింది.  

పేలవ ప్రయోగాలు... : కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ వ్యూహాలకు ఈ మ్యాచ్‌ పరీక్షగా నిలవనుంది. ముంబైతో తొలి మ్యాచ్‌లో చేసిన తప్పిదాలు సరిదిద్దుకునేందుకు కార్తీక్‌కు ఇదే మంచి అవకాశం. మ్యాచ్‌ తమ చేజారక ముందే భీకర హిట్టింగ్‌ చేసే రసెల్‌తో పాటు ఇయాన్‌ మోర్గాన్‌ను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో పైకి తీసుకువస్తే కోల్‌కతాకు అనుకూల ఫలితం వచ్చే అవకాశం ఉంది. నైట్‌రైడర్స్‌ తరఫున గత సీజన్‌లో అత్యధిక పరుగులు (510) సాధించిన రసెల్‌ను ఆరో స్థానంలో కాకుండా టాపార్డర్‌లో ఆడించడం ద్వారా అతనికి స్వేచ్ఛగా ఆడే అవకాశం కల్పించవచ్చు. బౌలింగ్‌లోనూ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ను సరిగ్గా వాడుకోకపోవడం ప్రత్యర్థికి కలిసొచ్చింది. కోట్లు కుమ్మరించి కొనుక్కున్న కమిన్స్‌ కూడా ప్రభావం చూపలేకపోయాడు. ఈ లోపాలను సవరించుకోవడంతో పాటు ఆత్మరక్షణ ధోరణితో కాకుండా దూకుడుగా ఆడితే కోల్‌కతా మెరవడం ఖాయం.

Advertisement
Advertisement