ప్రధాని మోదీ నోట సాధారణ క్రికెటర్‌ మాట | From Ranji Glory To IPL Debut, PM Modi Praises Jammu Kashmir Auqib Nabi, Delhi Capitals New IPL Star In Spotlight | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ నోట సాధారణ క్రికెటర్‌ మాట

Mar 29 2026 6:46 PM | Updated on Mar 29 2026 7:05 PM

Indian PM Narendra Modi Brings Up Auqib Nabi Before IPL Debut

భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ నోట ఓ సాధారణ క్రికెటర్‌ మాట వినిపించింది. ఇవాళ (మార్చి 29) జరిగిన 'మన్‌ కీ బాత్‌' కార్యక్రమంలో మోదీ ఆ క్రికెటర్‌ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ క్రికెటర్‌ పేరు ఆకిబ్‌ నబీ. జమ్మూ అండ్‌ కశ్మీర్‌కు చెందిన ఈ 29 ఏళ్ల కుడి చేతి వాటం మీడియం ఫాస్ట్‌ బౌలర్‌, ఇటీవల తన జట్టు తొలి రంజీ ట్రోఫీ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 

సీజన్‌ మొత్తంలో 60 వికెట్లు తీసి, తన జట్టు 70 ఏళ్ల కలను సాకారం చేశాడు. ఈ కారణంగానే మోదీ నబీ పేరును మన్‌ కీ బాత్‌లో ప్రస్తావించారు. నబీ కారణంగా జమ్మూ అండ్‌ కశ్మీర్‌ సాధించిన విజయం అక్కడి యువతలో క్రీడలపై ఉత్సాహం పెంచిందని అన్నారు. నబీ స్పూర్తితో రాబోయే రోజుల్లో మరెందరో ఆ ప్రాంతం నుంచి క్రీడల్లోకి వస్తారని ఆశాభావం వ్యక్తం​ చేశారు. ఓ సాధారణ క్రికెటర్‌ మాట ప్రధాని నోట రావడంతో అతని పేరు సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతుంది.

దేశవాలీ క్రికెట్‌లో ఇప్పటికే పేరు గడించిన నబీ, త్వరలో ఐపీఎల్‌ అరంగేట్రం చేసే అవకాశం కూడా ఉంది. ఈ సీజన్‌ (2026) వేలంలో నబీని ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ.8.40 కోట్ల భారీ మొత్తానికి కైవసం చేసుకుంది. రూ.30 లక్షల బేస్‌ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన నబీ కోసం రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వంటి ఫ్రాంచైజీలు పోటీపడినా, చివరికి అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది. ఈ డీల్‌తో నబీ జీవితమే మారిపోనుంది. ఐపీఎల్‌లో అతను సత్తా చాటగలిగితే, టీమిండియా అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్‌కు సంబంధించి మిచెల్‌ స్టార్క్‌ అందుబాటులో లేకపోవడంతో అతని స్థానం ఖాళీగా ఉంది. పవర్‌ప్లేలో బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేయగల నబీ ఆ లోటును భర్తీ చేసే అవకాశం ఉంది. ఢిల్లీ పేసర్లు లుంగి ఎంగిడి, దుష్మంత చమీరా మధ్య ఓవర్లలో బౌలింగ్‌ చేయడం ఇష్టపడతారు కాబట్టి, నబీ పవర్‌ప్లేలో కీలకంగా మారవచ్చు. ఢిల్లీ ఏప్రిల్‌ 1న లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్‌ 2026 ప్రయాణం మొదలుపెడుతుంది.  

 

Advertisement
 
Advertisement
Advertisement