చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు షాక్‌ | India Loss Semi Final Match Against US World Chess Olympiad | Sakshi
Sakshi News home page

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు షాక్‌

Published Wed, Sep 15 2021 8:03 AM | Last Updated on Wed, Sep 15 2021 10:38 AM

India Loss Semi Final Match Against US World Chess Olympiad - Sakshi

చెన్నై: ఆన్‌లైన్‌ వరల్డ్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో గత ఏడాది సంయుక్త విజేత భారత జట్టుకు చుక్కెదురైంది. అమెరికా జట్టుతో మంగళవారం జరిగిన సెమీఫైనల్లో భారత్‌ ‘బ్లిట్జ్‌ టైబ్రేక్‌’లో 1.5–4.5తో పరాజయం పాలైంది. ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక ఆడిన మూడు గేముల్లోనూ విజయం సాధించినా ఆమె సహచరులు తడబడటంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ముందుగా తొలి రౌండ్‌ మ్యాచ్‌లో టీమిండియా 5–1తో అమెరికాను ఓడించి 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

హారిక 68 ఎత్తుల్లో అనా జటోన్‌స్కీపై, విశ్వనాథన్‌ ఆనంద్‌ 57 ఎత్తుల్లో జెఫ్రీ జియాంగ్‌పై, పెంటేల హరికృష్ణ 53 ఎత్తుల్లో దరియజ్‌పై, వైశాలి 38 ఎత్తుల్లో థలియా లాండిరోపై గెలుపొందారు. కోనేరు హంపి 29 ఎత్తుల్లో ఇరీనా క్రష్‌తో, నిహాల్‌ సరీన్‌ 70 ఎత్తుల్లో లియాంగ్‌ అవండర్‌లతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. రెండో రౌండ్‌ మ్యాచ్‌లో భారత్‌ 2–4తో ఓడిపోయింది. దాంతో స్కోరు 1–1తో సమమైంది. హారిక 51 ఎత్తుల్లో నాజి పైకిద్జెపై నెగ్గగా... హంపి 32 ఎత్తుల్లో ఇరీనా క్రష్‌తో, వైశాలి 60 ఎత్తుల్లో థలియా లాండిరోతో గేమ్‌లను ‘డ్రా’గా ముగించారు. ప్రజ్ఞానంద 54 ఎత్తుల్లో లియాంగ్‌ చేతిలో, విదిత్‌ 46 ఎత్తుల్లో రాబ్సన్‌ రే చేతిలో, ఆనంద్‌ 35 ఎత్తుల్లో జెఫ్రీ జియాంగ్‌ చేతిలో ఓడిపోయారు.

నిర్ణాయక ‘బ్లిట్జ్‌ టైబ్రేక్‌’లో హారిక 34 ఎత్తుల్లో నాజి పైకిద్జెపై గెలుపొందగా... నిహాల్‌ 44 ఎత్తుల్లో లియాంగ్‌తో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. వైశాలి 31 ఎత్తుల్లో థలియా చేతిలో, హరికృష్ణ 35 ఎత్తుల్లో జెఫ్రీ జియాంగ్‌ చేతిలో, హంపి 49 ఎత్తుల్లో ఇరీనా క్రష్‌ చేతిలో, ఆధిబన్‌ 33 ఎత్తుల్లో రాబ్సన్‌ రే చేతిలో ఓటమి చవిచూశారు. మరో సెమీఫైనల్లో రష్యా 2–0తో చైనాను ఓడించి నేడు జరిగే ఫైనల్లో అమెరికాతో టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement