పాక్‌ క్రికెటర్లకు భారత్‌ వీసాలు!

India To Grant Visas To Pakistan Players For T20 World Cup - Sakshi

ముంబై: భారత్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య క్రికెట్‌ సంబంధాలు చెడి చాలా ఏళ్లే అయ్యింది. అప్పుడప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) నిర్వహించే మెగా ఈవెంట్లు మినహా ఈ రెండు జట్లు ముఖాముఖి తలపడిన సందర్భాలు సుదీర్ఘకాలంగా లేవు.  కానీ మళ్లీ ఐసీసీ ఈవెంట్‌లో భాగంగా ఈ ఏడాది భారత్‌లో టీ20 వరల్డ్‌కప్‌ జరుగనున్న నేపథ్యంలో పాకిస్తాన్‌ క్రికెటర్ల వీసాల అంశం తెరపైకి వచ్చింది. 

పాకిస్థాన్ ప్లేయర్లకు వీసాలు ఇస్తారో లేదనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ విషయంపై స్పష్టత వచ్చింది. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌లో ఆరంభమయ్యే పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్‌‌లో ఆడే పాక్ ఆటగాళ్లకు వీసాలు మంజూరు అవుతాయని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ పేర్కొంది.  ప్రభుత్వ హామీ ప్రకారం పాక్ క్రికెటర్లకు వీసాలు మంజూరు అవుతాయని బోర్డు సెక్రటరీ జైషా కౌన్సిల్‌‌ సమావేశంలో స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.  పాకిస్తాన్‌ క్రికెటర్లకు భారత వీసాలు ఇచ్చే అంశంపై ఐసీసీకి హామీ ఇచ్చినట్లు జైషా సమావేశంలో తెలిపారు.  దీనిలో భాగంగానే తమ కార్యచరణను ముమ్మరం చేసింది బీసీసీఐ. 

‘పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌‌కు వీసాల జారీ సమస్య ఓ కొలిక్కి వచ్చింది. అయితే పాక్ ఫ్యాన్స్ ఇక్కడకు వచ్చి మ్యాచ్‌‌లను వీక్షించే విషయం మీద ఇంకా క్లారిటీ రాలేదు’ అని అపెక్స్ కౌన్సిల్‌‌కు చెందిన ఓ మెంబర్ నేషనల్ మీడియాతో చెప్పారు.  టీ20 కప్ నిర్వహణపై శుక్రవారం బోర్డు కౌన్సిల్ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఇందులో టీ20 ప్రపంచ కప్ వేదికలను ఖరారు చేశారు.  తొమ్మిది వేదికల్లో టోర్నీని ఘనంగా నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అహ్మదాబాద్‌‌లో కొత్తగా నిర్మించిన నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మిగిలిన మ్యాచ్‌‌లు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌‌కతా, బెంగళూరు, హైదరాబాద్, ధర్మశాల, లక్నోలో నిర్వహించనున్నారు.

ఇక్కడ చదవండి: ‘జడేజాను మరచిపోయారా.. ఇది చాలా అవమానకరం’
నన్ను చంపాలనే ప్రోగ్రామ్‌ పెట్టారా..?: రోహిత్‌‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top