Joe Root- Jonny Bairstow: రూట్‌, బెయిర్‌స్టోపై సచిన్‌ ప్రశంసల జల్లు.. బ్యాటింగ్‌ చేయడం ఇంత సులువా?!

Ind Vs Eng 5th Test: Sachin Tendulkar Lauds Joe Root Jonny Bairstow Innings - Sakshi

India Vs England 5th Test: ఇంగ్లండ్‌ బ్యాటర్లు జో రూట్‌, జానీ బెయిర్‌స్టోపై టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ ప్రశంసలు కురిపించాడు. బ్యాటింగ్‌ చేయడం ఇంత సులువా అనేలా అందరినీ ఆశ్చర్యపరిచారని కొనియాడాడు. కాగా టీమిండియాతో జరిగిన రీషెడ్యూల్డ్‌ టెస్టులో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఇక ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో మాజీ కెప్టెన్‌ జో రూట్‌(142 పరుగులు- నాటౌట్‌), బెయిర్‌స్టో(114 పరుగులు- నాటౌట్‌) 269 పరుగులు భాగస్వామ్యం నమోదు చేశారు. భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా భీకర బ్యాటింగ్‌తో చెలరేగారు. ఇరువురూ సెంచరీలతో అజేయంగా నిలిచారు.

తద్వారా మూడో రోజు వరకు పర్యాటక జట్టు చేతుల్లో ఉన్న మ్యాచ్‌ను.. అమాంతంగా లాక్కొని ఇంగ్లండ్‌ను ఏడు వికెట్ల తేడాతో గెలిపించారు. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ 2-2తో సమమైంది. ఈ నేపథ్యంలో ట్విటర్‌ వేదికగా స్పందించిన సచిన్‌.. రూట్‌, బెయిర్‌స్టోలను అభినందించాడు. ‘‘ఇంగ్లండ్‌కు ఇది ఓ ప్రత్యేకమైన విజయం. సిరీస్‌ సమమైంది. 

జో రూట్‌, జానీ బెయిర్‌స్టో అద్భుత ఫామ్‌ కనబరిచారు. బ్యాటింగ్‌ చేయడం ఇంత ఈజీనా అనిపించారు’’ అంటూ ఇంగ్లండ్‌ కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ను ట్యాగ్‌ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇక స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన రూట్‌.. కివీస్‌ ఆటగాడు డారిల్‌ మిచెల్‌తో కలిసి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు.

టీమిండియాతో సిరీస్‌లోనూ తాత్కాలిక కెప్టెన్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాతో కలిసి ఈ అవార్డును పంచుకున్నాడు. ఈ క్రమంలో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇక ఐదో టెస్టులో బెయిర్‌ స్టో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. అదే విధంగా ర్యాంకింగ్స్‌లో ఏకంగా 11 స్థానాలు ఎగబాకి పదో స్థానానికి చేరుకున్నాడు.

చదవండి: Ind Vs WI 2022: విండీస్‌తో సిరీస్‌.. శిఖర్‌ ధావన్‌కు బంపరాఫర్‌.. వన్డే జట్టు కెప్టెన్‌గా.. బీసీసీఐ ప్రకటన
Virat Kohli: ఆరేళ్లలో ఇదే తొలిసారి.. అయినా నీకే ఎందుకిలా? ఇప్పటికైనా కళ్లు తెరువు.. లేదంటే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top