ILT20 2023: ఐదేసి ఇరగదీసిన వీస్‌.. దుబాయ్‌ లీగ్‌ నుంచి నిష్క్రమించిన వారియర్స్‌

ILT20 2023: Wiese Five Fer Wrecks Sharjah Warriors Playoff Hopes - Sakshi

ఇనాగురల్‌ ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌-2023 (దుబాయ్‌ లీగ్‌)లో ప్లే ఆఫ్స్‌ బెర్తులు ఖరారయ్యాయి. నిన్న (ఫిబ్రవరి 6) జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో గల్ఫ్‌ జెయింట్స్‌ చేతిలో ఓటమిపాలవ్వడంతో షార్జా వారియర్స్‌ లీగ్‌ నుంచి నిష్క్రమించింది. జెయింట్స్‌ పేసర్‌, వెటరన్‌ ఆల్‌రౌండర్‌ డేవిస్‌ వీస్‌ ఐదు వికెట్లు (4-0-20-5) తీసి అదరగొట్టడంతో జెయింట్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, టేబుల్‌ టాపర్‌గా ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన జెయింట్స్‌.. వారియర్స్‌ను 18.3 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌట్‌ చేసింది. వారియర్స్‌ ఇన్నింగ్స్‌లో కోహ్లెర్‌ కాడ్‌మోర్‌ (33), స్టోయినిస్‌ (18), మహ్మద్‌ నబీ (21), నూర్‌ అహ్మద్‌ (10) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. వారియర్స్‌ ఇన్నింగ్స్‌లో కోహ్లెర్‌ కాడ్‌మోర్‌ ఆరంభంలో మెరుపు వేగంతో పరుగులు చేసి జెయింట్స్‌ బౌలర్లను భయపెట్టాడు. అయితే టామ్‌ హెల్మ్‌ కాడ్‌మోర్‌కు కళ్లెం వేయడంతో వారియర్స్‌ ఢీలా పడిపోయి వరుసగా వికెట్లు కోల్పోయింది. జెయింట్స్‌ బౌలర్లలో వీస్‌ ఐదేయగా.. కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ 2, సంచిత్‌ శర్మ, టామ్‌ హెల్మ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం 108 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జెయింట్స్‌16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. టామ్‌ బాంటన్‌ (11), కెప్టెన్‌ జేమ్స్‌ విన్స్‌ (27), కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌ (35), అయాన్‌ అఫ్జల్‌ ఖాన్‌ (14 నాటౌట్‌), గెర్హార్డ్‌ ఎరాస్మస్‌ (10 నాటౌట్‌) రాణించారు. వారియర్స్‌ బౌలర్లలో జునైద్‌ సిద్ధిఖీ 2, మార్కస్‌ స్టోయినిస్‌ ఓ వికెట​ పడగొట్టారు.

ఈ విజయంతో వారియర్స్‌ లీగ్‌ నుంచి నిష్క్రమించగా.. తొలి రెండు స్థానాల్లో నిలిచిన గల్ఫ్‌ జెయింట్స్‌, డెసర్ట్‌ వైపర్స్‌ క్వాలిఫయర్స్‌కు.. 3, 4 స్థానాల్లో నిలిచిన ముంబై ఎమిరేట్స్‌, దుబాయ్‌ క్యాపిటల్స్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌ను అర్హత సాధించాయి. 6 జట్లలో చివరి స్థానంలో నిలిచిన అబుదాబీ నైట్‌రైడర్స్‌ ఇదివరకే లీగ్‌ నుంచి నిష్క్రమించింది.

  • ఫిబ్రవరి 8: గల్ఫ్‌ జెయింట్స్‌, డెసర్ట్‌ వైపర్స్‌ (క్వాలిఫయర్స్‌ 1)
  • ఫిబ్రవరి 9: ముంబై ఎమిరేట్స్‌, దుబాయ్‌ క్యాపిటల్స్‌ (ఎలిమినేటర్‌)

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top