ఫిన్ అలెన్ సెంచ‌రీ.. ఢిల్లీపై కేకేఆర్‌ విజయం | Finn Allen Century Guides KKR Victory Vs Delhi Capitals By 8 Wickets | Sakshi
Sakshi News home page

ఫిన్ అలెన్ సెంచ‌రీ.. ఢిల్లీపై కేకేఆర్‌ విజయం

May 8 2026 10:58 PM | Updated on May 8 2026 11:08 PM

Finn Allen Century Guides KKR Victory Vs Delhi Capitals By 8 Wickets

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో కేకేఆర్ వ‌రుసగా నాలుగో విజ‌యాన్ని అందుకుంది. శుక్ర‌వారం ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన  మ్యాచ్‌లో కేకేఆర్ ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై 8 వికెట్ల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. ఫిన్ అలెన్ సెంచ‌రీతో విధ్వంసం సృష్టించ‌డంతో కేకేఆర్ సునాయాస విజ‌యాన్ని అందుకుంది. 

ఢిల్లీ విధించిన‌ 143 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కేకేఆర్ 14.2 ఓవ‌ర్ల‌లో కేవ‌లం రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఛేదించింది. ఫిన్ అలెన్ (47 బంతుల్లోనే 100 నాటౌట్‌) అజేయ సెంచ‌రీ సాధించి జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. కామ‌రున్ గ్రీన్ 33 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో అక్ష‌ర్ ప‌టేల్ ఒక్క వికెట్ తీశాడు. 

అంత‌క‌ముందు కేకేఆర్ బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 142 ప‌రుగులు చేసింది. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక (50) అర్థసెంచరీతో రాణించగా.. చివర్లో అశుతోశ్ శర్మ (39) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కేకేఆర్ బౌలర్లలో అనుకుల్ రాయ్‌, కార్తిక్ త్యాగి చెరో 2 వికెట్లు పడగొట్టగా, వైభవ్ అరోరా, సునీల్ నరైన్‌, గ్రీన్ తలా ఒక వికెట్ తీశారు.

విఫ‌ల‌మైన బ్యాట‌ర్లు..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ఓపెన‌ర్లు పాతుమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు ఈ జోడీ 4.6 ఓవ‌ర్ల‌లో 49 ప‌రుగులు సాధించారు. రాహుల్ ఔటైన త‌ర్వాత నిస్సాంక ఒక ఎండ్‌లో నిలబ‌డిన‌ప్పటికీ ఢిల్లీ క్ర‌మంగా వికెట్లు కోల్పోతూ వ‌చ్చింది. 

29 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ చేసిన నిస్సాంక ఔటైన త‌ర్వాత ఢిల్లీ ఇన్నింగ్స్ న‌త్త‌న‌డ‌క‌న సాగింది. ఆఖ‌ర్లో అశుతోశ్ శ‌ర్మ 28 బంతుల్లో 39 ప‌రుగులు చేయ‌డంతో ఢిల్లీ గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరును సాధించింది.

ఆడుతూ పాడుతూ..
143 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కేకేఆర్‌కు ఆరంభంలో దుర‌దృష్టం వెంటాడింది. అజింక్యా ర‌హానే ర‌నౌట్ కాగా, అంగ్‌క్రిష్ ర‌ఘువంశీ వికెట్ల మీద‌కు ఆడుకొని వెనుదిరిగారు. ఈ ఇద్ద‌రు ఔటైన త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన కామెరున్ గ్రీన్‌తో క‌లిసి ఫిన్ అలెన్ ఇన్నింగ్స్ కొన‌సాగించాడు. 32 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ సాధించిన ఫిన్ అలెన్ ఆ త‌ర్వాత గేర్ మార్చాడు. 

ఢిల్లీ బౌల‌ర్ల‌ను చీల్చి చెండాడిన అలెన్ బౌండ‌రీలు, సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించాడు. తొలి 50 ప‌రుగుల‌కు 32 బంతులు తీసుకున్న ఫిన్ అలెన్ రెండో ఫిఫ్టీకి కేవ‌లం 15 బంతులే తీసుకోవ‌డం విశేషం. ఫిన్‌కు తోడు గ్రీన్ కూడా రెచ్చిపోవ‌డంతో 34 బంతులు మిగిలి ఉండ‌గానే కేకేఆర్ విజ‌యాన్ని అంందుకుంది. 

సెంచ‌రీతో విధ్వంసం సృష్టించిన ఫిన్ అలెన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది. ఈ విజ‌యంతో కేకేఆర్ 11 మ్యాచ్‌ల్లో 4 విజ‌యాలతో ప‌ట్టిక‌లో ఏడో స్థానానికి చేరుకోగా, అదే స‌మ‌యంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ 11 మ్యాచ్‌ల్లో ఏడు ఓట‌ముల‌తో 8వ  స్థానానికి ప‌డిపోయింది.

చదవండి: వెంటాడిన దురదృష్టం.. పాపం రహానే, రఘువంశీ!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement