FIFA World Cup Qatar 2022 Second Semi-Final: ఫైనల్‌కు ‘ఫ్రెంచ్‌ కిక్‌’ FIFA World Cup Qatar 2022 Second Semi-Final: France defeat Morocco 2-0 in the semi-finals | Sakshi
Sakshi News home page

FIFA World Cup Qatar 2022 Second Semi-Final: ఫైనల్‌కు ‘ఫ్రెంచ్‌ కిక్‌’

Published Fri, Dec 16 2022 4:11 AM

FIFA World Cup Qatar 2022 Second Semi-Final: France defeat Morocco 2-0 in the semi-finals - Sakshi

ఎట్టకేలకు మొరాకో తన ప్రత్యర్థికి గోల్స్‌ సమర్పించుకుంది. మేటి జట్లకే కంటిమీద కునుకు లేకుండా చేసిన ఈ ఆఫ్రికా జట్టు చివరకు సెమీఫైనల్లో ఓడింది. సంచలనానికి ఛాన్స్‌ ఇవ్వని ఫ్రాన్స్‌ నిర్ణీత సమయంలోనే విజయం సాధించింది. ‘డిఫెండింగ్‌ చాంపియన్‌’ వరుసగా రెండో ప్రపంచకప్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. నిజానికి మొరాకో ఆషామాషీగా తలొగ్గలేదు. గోల్‌ కోసం ఆఖరి ఇంజ్యూరీ టైమ్‌ దాకా శ్రమించింది. మైదానం మొత్తం మీద ఫ్రాన్స్‌ స్ట్రయికర్లకు దీటుగా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై గురి పెట్టినప్పటికీ అదృష్టం కలిసి రాలేదు.

మరోవైపు ఫ్రాన్స్‌... ఈ టోర్నీలోనే కొరకరాని కొయ్యను ఐదో నిమిషంలోనే దారికి తెచ్చుకుంది. ద్వితీయార్ధంలో ఎదురులేని విజయానికి స్కోరును రెట్టింపు చేసుకుంది. ఏమాత్రం అంచనాలు లేకుండా ఖతర్‌కు వచ్చి తమ అద్భుత పోరాటపటిమతో తమకంటే ఎంతో మెరుగైన జట్లను బోల్తా కొట్టించిన మొరాకో ఇక మూడో స్థానం కోసం శనివారం గత ప్రపంచకప్‌ రన్నరప్‌ క్రొయేషియాతో తలపడుతుంది.  

దోహా: అర్జెంటీనా ఫైనల్‌ ప్రత్యర్థి ఎవరో తేలింది. ఇక ఆఖరి సమరమే మిగిలుంది. విజేత ఎవరో... రన్నరప్‌గా మిగిలేదెవరో ఆదివారం రాత్రి తెలుస్తుంది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌ 2–0 గోల్స్‌ తేడాతో ఈ టోర్నీలో మింగుడు పడని ప్రత్యర్థి మొరాకోను ఓడించి ఫైనల్‌ చేరింది. మ్యాచ్‌ 5వ నిమిషంలో థియో హెర్నాండెజ్‌... 79వ నిమిషంలో ‘సబ్‌స్టిట్యూట్‌’ రాన్‌డల్‌ కొలొముని ఫ్రాన్స్‌ జట్టుకు చెరో గోల్‌ అందించారు.

78వ నిమిషంలోనే మైదానంలోకి వచ్చిన సబ్‌స్టిట్యూట్‌ రాన్‌డల్‌ 44 సెకన్లలోనే గోల్‌ చేయడం విశేషం. ఈ మెగా టోర్నీలోనే నిర్ణీత సమయంలో క్వార్టర్స్‌ దాకా ప్రత్యర్థులెవరికీ గోల్‌ ఇవ్వని మొరాకో సెమీస్‌లో రెండు గోల్స్‌ ఇవ్వడమే కాకుండా ఒక్క గోల్‌ కూడా చేయలేకపోయింది. మొరాకో గత మ్యాచ్‌లకి, తాజా సెమీఫైనల్స్‌కు ఇదొక్కటే తేడా! దీని వల్లే సంచలనం, టైటిల్‌ సమరం రెండు సాకారం కాలేకపోయాయి.  

ఆట మొదలైన కాసేపటికే ఫ్రాన్స్‌ పంజా విసరడం మొదలు పెట్టింది. గ్రీజ్‌మన్‌ ‘డి’ ఏరియాలో బంతిని ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌ సమీపానికి తీసుకెళ్లాడు. కానీ క్రాస్‌ షాట్‌ కష్టం కావడంతో కిలియాన్‌ ఎంబాపెకు క్రాస్‌ చేశాడు. కానీ అతని షాట్‌ విఫలమైంది. అక్కడే గుమిగూడిన మొరాకో డిఫెండర్లు అడ్డుకున్నారు. అయితే బంతి మాత్రం అక్కడక్కడే దిశ మార్చుకుంది. గోల్‌పోస్ట్‌కు కుడివైపు వెళ్లగా అక్కడే ఉన్న థియో హెర్నాండెజ్‌ గాల్లోకి ఎగిరి ఎడమ కాలితో కిక్‌ సంధించాడు. దీన్ని ఆపేందుకు గోల్‌ కీపర్‌ యాసిన్‌ బోనో అతని ముందుకెళ్లగా... మొరాకో కెప్టెన్‌ రొమెయిన్‌ సైస్, అచ్రాఫ్‌ డారి గోల్‌పోస్ట్‌ను కాచుకున్నారు. అయినా సరే హెర్నాండెజ్‌ తన ఛాతీ ఎత్తున ఉన్న బంతిని ఎడమ కాలితో తన్ని లక్ష్యానికి చేర్చాడు.

ఆఖరి క్షణంలో గోల్‌పోస్ట్‌లోనే ఉన్న అచ్రాఫ్‌ డారి దాన్ని ఆపేందుకు విఫలయత్నం చేశాడు. కానీ అతని కుడి మొకాలికి వెంట్రుకవాసి దూరంలోనే బంతి గోల్‌ అయ్యింది. ఫ్రాన్స్‌ 1–0 ఆధిక్యంలోకి వెళ్లింది. మరో 5 నిమిషాల వ్యవధిలోనే... మొరాకోకు ఆట పదో నిమిషంలో సమం చేసే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. ‘డి’ ఏరియా వెలుపలి నుంచి అజెడైన్‌ వొవునహి ఫ్రాన్స్‌ గోల్‌పోస్ట్‌ లక్ష్యంగా లాంగ్‌షాట్‌ కొట్టాడు. ఫ్రాన్స్‌ గోల్‌కీపర్‌ లోరిస్‌ ఎడమ చేతితో అడ్డుకున్నప్పటికీ బంతి రీబౌండ్‌ అయింది. కానీ సమీపంలో తిరిగి షాట్‌ కొట్టే మొరాకో స్ట్రయికర్లు ఎవరూ లేకపోవడంతో గోల్‌ అవకాశం త్రుటిలో చేజారింది. 17వ నిమిషంలో ఫ్రాన్స్‌ స్కోరు రెట్టింపయ్యే ఛాన్స్‌ కూడా మిస్సయ్యింది.

ఒలివియర్‌ జిరూడ్‌ మెరుపు వేగంతో మొరాకో ‘డి’ ఏరియాలోకి దూసుకొచ్చి బలంగా కొట్టిన షాట్‌ ప్రత్యర్థి గోల్‌కీపర్‌ కూడా ఆపలేకపోయాడు. కానీ బంతి గోల్‌పోస్ట్‌ కుడివైపున బార్‌ అంచును తాకి బయటికి వెళ్లిపోయింది. మళ్లీ 36వ నిమిషంలోనూ ఫ్రాన్స్‌ ఆటగాడు జిరూడ్‌ గట్టిగానే ప్రయత్నించాడు. వాయువేగంతో కొట్టిన షాట్‌ను మొరాకో డిఫెండర్‌ జవాద్‌ ఎల్‌ యామిక్‌ కళ్లు చెదిరే కిక్‌తో అడ్డుకున్నాడు. లేదంటే బంతి బుల్లెట్‌ వేగంతో గోల్‌పోస్ట్‌లోకి వెళ్లేది! 44వ నిమిషంలో కార్నర్‌ను గోల్‌పోస్ట్‌ కుడివైపున ఉన్న జవాద్‌ ఎల్‌ యామిక్‌ చక్కగా తనను తాను నియంత్రించుకొని బైసైకిల్‌ కిక్‌ కొట్టాడు. దాదాపు గోల్‌ అయ్యే ఈ షాట్‌ను ఫ్రాన్స్‌ గోల్‌కీపర్‌ లోరిస్‌ కుడి వైపునకు డైవ్‌ చేసి చేతితో బయటికి పంపించాడు.  

ద్వితీయార్ధంలోనూ మొరాకో గోల్స్‌ కోసం అదేపనిగా చేసిన ప్రయత్నాల్ని ఫ్రాన్స్‌ ఆటగాళ్లు ఎక్కడికక్కడ కట్టడి చేసి అడ్డుకున్నారు. 78వ నిమిషంలో రాన్‌డల్‌ మైదానంలోకి వచ్చాడు. అప్పుడే సహచరులు మార్కస్‌ తురమ్, ఎంబాపెలు మొరాకో ‘డి’ ఏరియాలో పరస్పరం పాస్‌ చేసుకొని గోల్‌పై గురి పెట్టారు. కానీ డిఫెండర్లు చుట్టుముట్టడంతో గోల్‌పోస్ట్‌కు మరింత సమీపంలో ఉన్న రాన్‌డల్‌కు ఎంబాపె క్రాస్‌పాస్‌ చేశాడు. 79 నిమిషంలో రాన్‌డల్‌ ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా సులువుగా గోల్‌పోస్ట్‌లోకి పంపడంతో ఫ్రాన్స్‌ ఆధిక్యం రెట్టింపైంది. మొరాకో విజయంపై ఆశలు వదులుకుంది.

4: ప్రపంచకప్‌ టోర్నీ చరిత్రలో ఫ్రాన్స్‌ నాలుగోసారి (1998, 2006, 2018, 2022) ఫైనల్‌ చేరింది. రెండుసార్లు (1998, 2018) విజేతగా నిలిచింది.  

5: వరుసగా రెండు అంతకంటే ఎక్కువసార్లు ప్రపంచకప్‌ టోర్నీలో ఫైనల్‌ చేరిన ఐదో జట్టుగా ఫ్రాన్స్‌ నిలిచింది. గతంలో ఇటలీ (1934, 1938), బ్రెజిల్‌ (1958, 1962), నెదర్లాండ్స్‌ (1974, 1978), పశ్చిమ జర్మనీ (1982, 1986), బ్రెజిల్‌ (1994, 1998, 2002) ఈ ఘనత సాధించాయి.   

4: తమ జట్టును వరుసగా రెండు ప్రపంచకప్‌ లలో ఫైనల్‌కు చేర్చిన నాలుగో కోచ్‌గా ఫ్రాన్స్‌కు చెందిన దిదీర్‌ డెషాంప్‌ గుర్తింపు పొందాడు. గతంలో విటోరియో పోజో (ఇటలీ; 1934, 1938), కార్లోస్‌ బిలార్డో (అర్జెంటీనా; 1986, 1990), బెకన్‌బాయెర్‌ (జర్మనీ; 1986, 1990) ఈ ఘనత సాధించారు. 1998లో తొలిసారి ప్రపంచకప్‌ గెలిచిన ఫ్రాన్స్‌ జట్టులో డెషాంప్‌ ప్లేయర్‌గా ఉన్నాడు. అనంతరం 2018లో విశ్వవిజేతగా నిలిచిన ఫ్రాన్స్‌ జట్టుకు ఆయనే కోచ్‌గా ఉన్నారు.   

3: ప్రపంచకప్‌ చరిత్రలో సబ్‌స్టిట్యూట్‌గా ఫాస్టెస్ట్‌ గోల్‌ చేసిన మూడో ప్లేయర్‌గా రాన్‌డల్‌ (ఫ్రాన్స్‌) గుర్తింపు పొందాడు. మొరాకోతో మ్యాచ్‌లో అతను సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన 44 సెకన్లకే గోల్‌ చేశాడు. ఈ జాబితాలో రిచర్డ్‌ మొరాలెస్‌ (ఉరుగ్వే; 2002లో సెనెగల్‌పై 16 సెకన్లలో), ఎబ్బీ సాండ్‌ (డెన్మార్క్‌; 1998లో నైజీరియాపై 26 సెకన్లలో) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement