Arjun Erigaisi: క్వార్టర్‌ ఫైనల్లో అర్జున్‌

Arjun Erigaisi enter quarterfinals in Goldmoney Asian Rapid Chess - Sakshi

ప్రపంచ చాంపియన్‌ కార్ల్‌సన్‌ను నిలువరించిన తెలంగాణ జీఎం

సాక్షి, హైదరాబాద్‌: ఆసియా ర్యాపిడ్‌ అంతర్జాతీయ ఆన్‌లైన్‌ చెస్‌ ప్రిలిమినరీ టోర్నమెంట్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం), భారత యువతార అర్జున్‌ ఇరిగైసి ఎనిమిదో స్థానంలో నిలిచి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 16 మంది మేటి గ్రాండ్‌మాస్టర్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో వరంగల్‌ జిల్లాకు చెందిన అర్జున్‌ 15 రౌండ్లకుగాను 8 పాయింట్లు స్కోరు చేసి నాకౌట్‌ దశకు అర్హత సాధించిన ఏకైక భారత ప్లేయర్‌గా నిలిచాడు. సోమవారం ఆడిన ఐదు గేమ్‌లను 17 ఏళ్ల అర్జున్‌ (2567 ఎలో రేటింగ్‌) ‘డ్రా’ చేసుకోవడం విశేషం.

14వ రౌండ్‌ గేమ్‌లో ప్రస్తుతం క్లాసిక్, ర్యాపిడ్, బ్లిట్జ్‌ విభాగాల్లో ప్రపంచ చాంపియన్‌ అయిన మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే–2847 రేటింగ్‌)ను అర్జున్‌ 63 ఎత్తుల్లో నిలువరించి ‘డ్రా’ చేసుకోవడం హైలైట్‌గా నిలిచింది. సో వెస్లీ (అమెరికా–2770)తో 11వ గేమ్‌ను 11 ఎత్తుల్లో... స్విద్లెర్‌ (రష్యా– 2714)తో 12వ గేమ్‌ను 40 ఎత్తు ల్లో... సలీమ్‌ (యూఏఈ–2682)తో 13వ గేమ్‌ను 36 ఎత్తుల్లో... అనీశ్‌ గిరి (నెదర్లాండ్స్‌–2780)తో జరిగిన చివరిదైన 15వ గేమ్‌ను అర్జున్‌ 40 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.

నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్స్‌లో అరోనియన్‌తో అర్జున్‌; కార్ల్‌సన్‌తో సో వెస్లీ; లిరెన్‌ డింగ్‌తో జాన్‌ క్రిస్టాఫ్‌; వ్లాదిస్లావ్‌తో అనీశ్‌ గిరి తలపడతారు. భారత్‌కే చెందిన విదిత్‌ 10వ ర్యాంక్‌లో, గుకేశ్‌ 12వ ర్యాంక్‌లో, ఆధిబన్‌ 15వ ర్యాంక్‌లో నిలిచి నాకౌట్‌ దశకు అర్హత పొందలేకపోయారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top