Goldmoney Asian Rapid Chess Results: అర్జున్‌ సంచలనం

Arjun Erigaisi Beats Hou Yifan - Sakshi

మహిళల చెస్‌ వరల్డ్‌ నంబర్‌వన్‌ హు ఇఫాన్‌పై విజయం

సాక్షి, హైదరాబాద్‌: గోల్డ్‌మనీ ఆసియా ర్యాపిడ్‌ ఆన్‌లైన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం), భారత యువతార అర్జున్‌ ఇరిగైసి సంచలన ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. టోర్నీ రెండో రోజు ఆదివారం ఐదు గేమ్‌లు ఆడిన అర్జున్‌ (2567 ఎలో రేటింగ్‌) రెండు గేముల్లో గెలిచి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్‌లో ఓడిపోయాడు. ఎనిమిదో రౌండ్‌ గేమ్‌లో, పదో రౌండ్‌ గేమ్‌లో అర్జున్‌ అద్భుతాలు చేశాడు.

పదో గేమ్‌లో మహిళల ప్రస్తుత వరల్డ్‌ నంబర్‌వన్, ప్రపంచ మాజీ చాంపియన్‌ హు ఇఫాన్‌ (చైనా–2658 ఎలో రేటింగ్‌)పై 33 ఎత్తుల్లో... ఎనిమిదో రౌండ్‌లో  భారత గ్రాండ్‌మాస్టర్‌ విదిత్‌ సంతోష్‌ (2726)పై 65 ఎత్తుల్లో అర్జున్‌ గెలుపొందాడు. గుకేశ్‌ (భారత్‌–2578)తో ఆరో గేమ్‌ను, అలీరెజా ఫిరూజా (ఇరాన్‌–2759)తో తొమ్మిదో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న అర్జున్‌... ఏడో గేమ్‌లో అరోనియన్‌ (అర్మేనియా–2781) చేతిలో ఓడిపోయాడు. 16 మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో పది రౌండ్‌లు ముగిశాక అర్జున్‌ 5.5 పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో ఉన్నాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top