ఏబీ డివిలియర్స్‌ సంచలన వ్యాఖ్యలు! | AB de Villiers Stuns All Compared Bethel To Vaibhav Sooryavanshi | Sakshi
Sakshi News home page

ఏబీ డివిలియర్స్‌ సంచలన వ్యాఖ్యలు!

May 8 2026 7:49 PM | Updated on May 8 2026 8:47 PM

AB de Villiers Stuns All Compared Bethel To Vaibhav Sooryavanshi

క్రికెట్‌ ప్రపంచంలో సరికొత్త సంచలనం వైభవ్‌ సూర్యవంశీ. గతేడాది కాలంగా ఫార్మాట్లకు అతీతంగా విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడుతున్నాడు ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌. ఇటు ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫునా.. అటు భారత్‌ అండర్‌-19 జట్టు తరఫున దుమ్ములేపుతున్నాడు.

టాప్‌-5లో
ఐపీఎల్‌-2026లో ఇప్పటికి పది మ్యాచ్‌లలో కలిపి 404 పరుగులు చేసిన వైభవ్‌.. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో టాప్‌-5లో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టడం ఖాయమంటూ మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఏబీ డివిలియర్స్‌ సంచలన వ్యాఖ్యలు!
ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ సంచలన రీతిలో స్పందించాడు. పదిహేనేళ్ల వైభవ్‌ సూర్యవంశీతో.. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో తనను తాను నిరూపించుకుంటున్న 22 ఏళ్ల జేకబ్‌ బెతెల్‌ను పోల్చాడు. ఈ మేరకు.. ‘‘గతంలోనూ ఇతడి పేరును నేను పలుమార్లు ప్రస్తావించాను.

అతడు అత్యద్భుతమైన ఆటగాడు. అయితే, మున్ముందు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.  వయసులో తేడా ఉండవచ్చు కానీ.. అతడి ఆట వైభవ్‌ సూర్యవంశీని గుర్తుకుతెస్తుంది. ఇద్దరూ ఎడమచేతి వాటం బ్యాటర్లే.

ఇ‍ద్దరూ క్రికెట్‌ సూపర్‌స్టార్లుగా ఎదుగుతారు
అత్యద్భుతమైన ప్రతిభ ఉన్న ఆటగాళ్లు. వీరిద్దరికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఇ‍ద్దరూ క్రికెట్‌ సూపర్‌స్టార్లుగా ఎదుగుతారు. ఈ క్రమంలో వారెంతో నేర్చుకుంటారు. అయితే, ముందుగా చెప్పినట్లు సవాళ్లను విజయవంతంగా అధిగమిస్తేనే అంతా సజావుగా సాగుతుంది. నేను మాత్రం వీరి భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంటుందని భావిస్తున్నా’’ అని డివిలియర్స్‌ చెప్పుకొచ్చాడు.

జేకబ్‌ వైభవ్‌లా చిన్నపిల్లాడు కాదని.. అయితే, ఇద్దరి బ్యాటింగ్‌ ఒకే విధంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. జేకబ్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు (ఆర్సీబీ)తోనే కొనసాగాలని తాను కోరుకుంటున్నట్లు డివిలియర్స్‌ తెలిపాడు.  

వైఫల్యాలే...
కాగా ఇంగ్లండ్‌ ఓపెనర్‌గా జేకబ్‌ బెతెల్‌ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. భవిష్య కెప్టెన్‌గానూ నీరాజనాలు అందుకుంటున్న అతడు.. ఇటీవల టీ20 ప్రపంచకప్‌-2026 సెమీ ఫైనల్లో విశ్వరూపం ప్రదర్శించాడు. టీమిండియాపై 48 బంతుల్లోనే 105 పరుగులతో సత్తా చాటాడు. అయితే, జట్టును మాత్రం గెలిపించుకోలేకపోయాడు.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న బెతెల్‌కు పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఫిల్‌ సాల్ట్‌- విరాట్‌ కోహ్లి ఓపెనింగ్‌ జోడీగా కుదురుకోవడంతో అతడికి మొండిచేయి ఎదురవుతోంది. 

అయితే, సాల్ట్‌ వేలి గాయం కారణంగా దూరం కాగా.. బెతెల్‌కు అనూహ్యంగా అవకాశం వచ్చింది. కానీ అతడు దీనిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికి ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి 43 పరుగులే చేశాడు.

చదవండి: Shreyas Iyer: శ్రేయస్ కెప్టెన్ అయితే వీళ్ల కెరీర్ ఖతం!

Advertisement
 
Advertisement
Advertisement