ఈత ఇంపు.. కొలను కంపు | - | Sakshi
Sakshi News home page

ఈత ఇంపు.. కొలను కంపు

May 1 2026 8:08 AM | Updated on May 1 2026 8:08 AM

● జిల్లా కేంద్రంలో రూ. కోట్లు వెచ్చించి నిర్మాణం ● అధికారుల మధ్య సమన్వయ లోపమే కారణం ● వినియోగంలోకి తీసుకురావాలంటున్న ప్రజలు

అధ్వానంగా సర్కార్‌స్విమ్మింగ్‌ పూల్‌
● జిల్లా కేంద్రంలో రూ. కోట్లు వెచ్చించి నిర్మాణం ● అధికారుల మధ్య సమన్వయ లోపమే కారణం ● వినియోగంలోకి తీసుకురావాలంటున్న ప్రజలు

సాక్షి, సిద్దిపేట: జిల్లా కేంద్రంలో 2016లో రూ.5కోట్ల వ్యయంతో 50 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పుతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఈత కొలను నిర్మించారు. అలాగే బేబీ స్విమ్మింగ్‌ పూల్‌ను సైతం ఏర్పాటు చేశారు. ప్రారంభంలో జాతీయ స్థాయి స్విమ్మింగ్‌ పోటీలు సైతం నిర్వహించారు. కరోనా కాలంలో కొన్ని రోజులు మూత పడింది. కొన్ని రోజులు మున్సిపల్‌ ఆధ్వర్యంలో నిర్వహణ కొనసాగింది. తర్వాత జిల్లా యుజవన క్రీడల శాఖ ఆధ్వర్యంలో గత నాలుగేళ్లు ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. సదరు కాంట్రాక్టర్లు నిర్వహణ గాలికి వదిలేశారు. వేసవి కాలంలో, డబ్బులు వచ్చే సమయంలోనే ఓపెన్‌ చేసే వారు. తర్వాత మూసివేస్తున్నారు. నాలుగేళ్లుగా కాంట్రాక్ట్‌ పొందిన వారు డబ్బులు చెల్లించకపోయినా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

సమన్వయ లోపం

మున్సిపల్‌ పరిధిలో ఉండటంతో తమకు అప్పగిస్తే వినియోగంలోకి తీసుకువస్తామని కలెక్టర్‌, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారులకు మున్సిపల్‌ కమిషనర్‌ లేఖ రాశారు. దీంతో మున్సిపాలిటీకి అప్పగించాలని కలెక్టర్‌ ఆదేశించినట్లు తెలిసింది. అధికారుల మధ్య సమన్వయ లోపంతో మరమ్మతులకు నోచుకోడం లేదు. పైగా రెండు శాఖల నిర్లక్ష్యం కారణంగా రూ.కోట్లు పెట్టి నిర్మించిన స్విమ్మింగ్‌ పూల్‌ నిరాదరణకు గురవుతోంది. ఇప్పటికై నా కలెక్టర్‌ స్పందించి త్వరగా మరమ్మతులు చేసి ఈ వేసవి కాలంలో అందుబాటులోకి తీసుకరావాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

భానుడి భగభగలకు ఉపశమనం పొందాలని ఆశించే పట్టణ వాసులకు, శిక్షణ పొందే క్రీడాకారులకు సిద్దిపేట లోని ఈత కొలను నిరాశే మిగులుస్తున్నది. మున్సిపల్‌, యువజన క్రీడల శాఖాధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన స్విమ్మింగ్‌ పూల్‌ నిరాదరణకు గురవుతోంది. 8 నెలలుగాతెరుచుకోకపోవడంతోకంపుకొడుతోంది.

మున్సిపాలిటీకి అప్పగించాం

కలెక్టర్‌ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ వారికి స్విమ్మింగ్‌ పూల్‌ బాధ్యతలను అప్పగించాం. ఈ మేరకు ఇదివరకే సంతకం చేశాను. విద్యుత్‌ బిల్లులు సైతం బకాయిలు ఉన్నాయి.

– శ్రీనివాస్‌ రెడ్డి, ఇన్‌చార్జి డీవైఎస్‌ఓ

అప్పగించలేదు

జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట ఈత కొలను ఉంది. కొలను నిర్వహణ బాధ్యతలు తమకు అప్పగించాలని లేఖ రాశాం. ఇంకా అప్పగించలేదు. మా ఆధీనంలోకి రాగానే మరమ్మతులు చేసి వినియోగంలోకి తీస్తాం.

– ఆశ్రిత్‌ కుమార్‌, కమిషనర్‌,

సిద్దిపేట పురపాలక సంఘం

అంతా చెత్తాచెదారం

ఎనిమిది నెలలుగా స్విమ్మింగ్‌ పూల్‌ను తెరవకపోవడంతో దుర్వాసన వస్తోంది. వర్షపు నీళ్లు, చెత్తా చెదారంతో నిండిపోయింది. ఎయిర్‌ బాల్స్‌ గొలుసు తెగిపోయింది. మోటార్లు పాడయ్యాయి. కొలను ఆవరణలో గడ్డి ఏపుగా పెరిగింది. కొన్ని నెలలుగా విద్యుత్‌ బిల్లు బకాయి ఉంది. ప్రైవేట్‌ పూల్స్‌ కోసమే ప్రభుత్వ స్విమ్మింగ్‌ పూల్‌ నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement