కలెక్టర్ కె.హైమావతి
సిద్దిపేటరూరల్: హెచ్‌పీవీ టీకా బిడ్డ భవిష్యత్‌కు రక్షణ కవచమని కలెక్టర్ కె.హైమావతి పేర్కొన్నారు. శుక్రవారం తన చాంబర్‌లో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌కు సంబంధించిన పోస్టర్‌ను డీఎంహెచ్‌ఓ, ప్రోగ్రాం ఆఫీసర్‌తో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గజ్వేల్, జీజీహెచ్ సిద్దిపేట, దుబ్బాక ఏరియా ఆసుపత్రి, సీహెచ్‌సీ హుస్నాబాద్‌లో 14 సంవత్సరాల వయసు గల బాలికలకు ఉచితంగా టీకాను వేస్తారన్నారు. తద్వారా బాలికలు గర్భాశయ క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చన్నారు. రుతుస్రావం అవుతున్నప్పటికి తీసుకోవచ్చన్నారు. టీకా తీసుకోవడం వల్ల ఎటువంటి దుష్ఫ్రభావాలు ఉండవని, ఇది పూర్తిగా సురక్షితమని పేర్కొన్నారు. మార్చి 31వ తేదీ వరకు టీకా తీసుకునే విధంగా తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధనరాజ్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ దీప్తి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యం అందించాలి
దుబ్బాకరూరల్: మండలంలోని తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందించే వైద్య సేవలను పరిశీలించారు. 99రోజుల కార్యాచరణ నిర్వహణ గురించి ప్రజలకు తెలిసేలా ఒక బ్యానర్ పెట్టుకోవాలని సూచించారు. అటెండెన్స్, ఓపీపీ రిజిస్టర్ పరిశీలించారు. ఆస్పత్రి సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించేలా కృషి చేయాలని వైద్యులకు సూచించారు.


