432 కేసుల ఉల్లంఘన
271 మద్యం కేసులు
5,181 లీటర్ల మద్యం స్వాధీనం
రూ.30 లక్షల నగదు సీజ్..
2,729 మంది బైండోవర్
పటిష్టంగా ఎన్నికల నియమావళి
సిబ్బందిని అభినందించిన సీపీ
సిద్దిపేటకమాన్: జిల్లాలో మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి పోలింగ్, కౌంటింగ్ ముగిసే వరకు పటిష్ట పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా ఇటీవల నూతన పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన విజయ్‌కుమార్ తన మార్క్ చాటుకున్నారు. సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన, మద్యం పంపిణీని అడ్డుకుని పోలీసులు కేసులు నమోదు చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టేలా ఎవరు చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చర్యలు తీసుకున్నారు.
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ నెల 17న మూడవ విడత పోలింగ్, కౌంటింగ్ ముగిసే వరకు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జిల్లాలో మొత్తం 432 కేసులు నమోదు చేశారు. వీటిలో 271 మద్యం కేసులు నమోదయ్యాయి. రూ.37,89,530 విలువగల 5,181 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉచితంగా వివిధ రకాల వస్తువులను పంపిణీ చేసేందుకు పలువురు ప్రయత్నించగా తనిఖీ బృందాలు పట్టుకుని 35 కేసులు నమోదు చేసి రూ.2,29,560 విలువగల వస్తువులను సీజ్ చేశారు. సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.30,36,620 నగదును పోలీసులు సీజ్ చేశారని తెలిపారు. అనుమతి లేని ర్యాలీలు నిర్వహించిన వారిపై 27కేసులు, బాణసంచా కాల్చడంపై 15కేసులు నమోదు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తగా 2,729 మందిని అధికారుల ముందుగానే బైండోవర్ చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక పోలీసు నిఘా ఏర్పాటు చేశారు.


