‘ఉపాధి’ చట్టాన్ని కొనసాగించాలి
చేర్యాల(సిద్దిపేట): మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు వెంకట్‌మావో అన్నారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక పాత బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై నిరసన చేపట్టి వీబీ జీ రాం జీ పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకం పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీబీ జీ రాంజీ పేరుతో ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందన్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా పని హక్కుగా ఉన్న పాత చట్టాన్ని మార్చి సాధారణ పథకంగా అమలు చేయాలని చూస్తుందన్నారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ పేరుతో ఉన్న పథకం పేరు మార్చడం మహాత్ముడిని అవమానపర్చడమే అన్నారు. ఈ పథకం అమలు చేసేందుకు కేంద్రం ఇస్తున్న 90 శాతం నిధులను 60 శాతానికి తగ్గించి రాష్ట్రాలపై భారం మోపుతుందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు అరుణ్, నర్సిరెడ్డి, శ్రీహరి, శోభ, రాజు, మైసయ్య, రవీందర్, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు వెంకట్‌మావో


