ఓటెత్తిన పల్లె
88.05 శాతం పోలింగ్ నమోదు..
తొలి విడత 147 సర్పంచ్, 1,208 వార్డుల్లో ఎన్నికలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటేసిన పల్లె వాసులు
సాక్షి, సిద్దిపేట: జిల్లాలో పల్లె ఓటరు ఓటెత్తారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. జిల్లాలోని ఏడు మండలాల్లో పోలింగ్ జరిగింది. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గజ్వేల్, మర్కూక్, జగదేవ్‌పూర్, ములుగు, వర్గల్, దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్, రాయపోలు మండలాలల్లో ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవమైన స్థానాలు మినహాయించి 147 సర్పంచ్, 1,208వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
చలి తీవ్రత కారణంగా...
ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో తొలి గంట సేపు పోలింగ్ నెమ్మదిగా సాగింది. 8 గంటల నుంచి ఊపందుకుంది. పోలింగ్‌కు ఆరు గంటల సమయం ఉండటంతో పోలింగ్ కేంద్రాలకు త్వరగా వచ్చారు. హైదరాబాద్‌కు ఉపాధికి, ఉద్యోగ కోసం వెళ్లిన పల్లె ఓటర్లు తమ సొంత గ్రామానికి చేరకుని ఓటు వేశారు. చాలా మంది ఓటర్లను అభ్యర్థులు తమ సొంత వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. చివరి అరగంట పోలింగ్ కేంద్రాల వద్ద హడావుడి కనిపించింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి, సీపీ విజయ్ కుమార్ పర్యవేక్షించారు.
భారీగా పోలింగ్..
తొలివిడత పోలింగ్ భారీగానే నమోదైంది. ఏకంగా 88.05 శాతం నమోదైంది. రాయపోలు మండలంలో అత్యధికంగా 89.59 శాతం పోలింగ్ నమో దైంది. అత్యల్పంగా జగదేవ్‌పూర్‌లో 84.27 శాతం ఓట్లు పోలయ్యాయి. మహిళలు అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటింగ్ సరళి ఇలా..
ఉదయం 9 గంటల వరకు పోలైన ఓట్లు: 44,995 (24.46 శాతం)
11 గంటల వరకు ఇలా: 1,10,488 (60.06 శాతం)
మధ్యాహ్నం 1 గంట వరకు : 1,47,348 (80.10 శాతం)
పోలింగ్ ముగిసే సమయం వరకు : 1,61,971 (88.05 శాతం)
ఓటెత్తిన పల్లె


