కొమురవెల్లిలో భక్తులకు ఇబ్బందులు తలెత్తొద్దు
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లిలో ఈనెల 14న జరిగే మల్లన్న కల్యాణ ఏర్పాట్లను దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు గురువారం ఆలయ అధికారులతో కలిసి పరిశీలించారు. స్వామి వారి కల్యాణం జరిగే తోటబావి ప్రాంగణం, క్యూకాంప్లెక్స్, ఆలయ పరిసరాలను సందర్శించారు. అనంతరం ఆలయ కార్యాలయంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి తగు సూచనలు చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ పరిసరాలలో శానిటేషన్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట ఏసీ సుధాకర్ రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఓం ప్రకాశ్, ఆలయ ఈఓ వెంకటేశ్, ఏఈఓ బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకులు చంద్రశేఖర్‌లు ఉన్నారు.
వెండి వస్తువుల బహూకరణ
మల్లన్న స్వామికి అమీన్‌పూర్‌కు చెందిన భక్తులు తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి 500 గ్రాములు వెండి వస్తువులను విరాళంగా గురువారం ఆలయ ఈఓ టంకసాల వెంకటేశ్‌కు అందిచారు. స్వామివారికి నైవేద్యం సమర్పించేందుకు ఉపయోగించే వెండి బాక్స్‌లను బహూకరించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, ముఖ్య అర్చకులు చిన్న మల్లికార్జున్, మనోహర్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


