బీఆర్‌ఎస్ 73కాంగ్రెస్ 64
వికసించని కమలం
పటిష్ట బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు
మొదటి విడత పల్లె పోరులో పోటాపోటీగా ఫలితాలు
సాక్షి, సిద్దిపేట: పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా సాగింది. పోలీసుల భారీ బందోబస్తు మధ్య కౌంటింగ్ జరిగింది. హోరాహోరీగా సాగిన తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు అధికార, ప్రతిపక్షాలు పోటా పోటీగా సర్పంచ్‌లను దక్కించుకున్నారు. మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువగా విజయం సాధించారు. అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. గ్రామ పంచాయతీ ఎన్నికలను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఈ రెండు పార్టీల మద్దతుదారులు పోటాపోటీగా ప్రచారం చేశారు. వారం రోజుల పాటు ప్రచారాన్ని హోరెత్తించారు. పెద్ద మొత్తంలో ఎన్నికల్లో ఖర్చు చేశారు. మద్యం, మాంసం, విందులు ఇచ్చారు. కీలకమైన కులసంఘాలు, యువతను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు.
బీఆర్‌ఎస్ బలంగా ఉన్న చోట..
తొలి విడతలో గజ్వేల్, జగదేవ్‌పూర్, మర్కూక్, వర్గల్, ములుగు, దౌల్తాబాద్, రాయపోలు మండలాల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 163 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా బీఆర్‌ఎస్ పార్టీ 73 సర్పంచ్ స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 64 సర్పంచ్‌లు, బీజేపీ 10 సర్పంచ్ స్థానాలు, ఇండిపెండెంట్లు 16 సర్పంచ్‌లు దక్కించుకున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీల బలంగా ఉన్న చోట కాంగ్రెస్ సర్పంచ్‌లు గెలుపొందడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది.
వికసించని కమలం
కమలం పార్టీ మద్దతు దారులు ఈ ఎన్నికల్లో తమ ఉనికి చాటలేదు. గత పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన కమలం పార్టీ పంచాయతీ ఎన్నికలకు వచ్చే సరికి ఆ స్థాయిలో సత్తా చాటలేకపోయింది. మరోవైపు స్వతంత్రుల కంటే బీజేపీ సర్పంచ్‌లు తక్కువ మంది గెలుపొందారు.. ఆయా గ్రామాల్లో అభ్యర్థికి ఉన్న మంచి పేరుతో విజయం సాధించినట్లయింది. ఈ గ్రామాల ప్రజలు పార్టీలకు అతీతంగా స్వతంత్య్ర అభ్యర్థిని గెలిపించడం గమనార్హం.
తూంకుంట ఇలాకాలో బీఆర్‌ఎస్..
మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డిది వర్గల్ మండల కేంద్రం.. అక్కడ బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జయభారతి గెలుపొందారు. డీసీసీ అధ్యక్షురాలిగా ఆంక్షారెడ్డి నియమితులైన తర్వాత తొలి ఎన్నికల్లోనే పార్టీ బలపర్చిన అభ్యర్థి ఓటమి చెందారు.
డ్రాతో సర్పంచ్‌గా గెలిచి..
మర్కూక్ మండలం గంగాపూర్–యూసుఫ్‌ఖాన్‌పల్లి సర్పంచ్‌గా పోటీ చేసిన ఇద్దరు బీఆర్‌ఎస్‌కు చెందిన వారే.. ఐతం శ్యామల, జంపల్లి లక్ష్మికి 194 ఓట్ల చొప్పున వచ్చాయి. డ్రా తీయగా శ్యామల గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. డ్రా తీసినప్పుడు ఎవరి పేరు వచ్చిందో పూర్తిగా చూపించ కుండానే శ్యామల గెలుపొందారని ప్రకటించారని లక్ష్మి తన అనుచరులతో కలిసి ఆందోళన చేశారు. దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జీ చేశారు. ఈ ప్రకటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని లక్ష్మి తెలిపారు.


