పల్లెకు పైసలెట్ల వస్తాయంటే..!
ఖర్చు చేసే విధానం
● సొంత వనరులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు
● ఆయా నిధులతోనే మౌలిక, సామాజిక వసతుల కల్పన
● మూడు రకాలుగా సమకూరనున్న ఆదాయం
జహీరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో కొత్త పాలక మండలి ఏర్పడనుంది. ఈ క్రమంలో గ్రామాభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు నిధుల అవసరం ఎంతో ఉంటుంది. ఇందు కోసం గ్రామ పంచాయతీలు ముఖ్యంగా సొంత వనరులను సమకూర్చుకోవడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్ల రూపంలో నిధులు పొందుతాయి. కర్మాగారాల నుంచి సీఎస్‌ఆర్ నిధులు కూడా కేటాయింపులు జరుగుతాయి. పంచాయతీలు విధించే పన్నులు, రుసుముల ద్వారా ఆదాయం పొందుతాయి. ఇంటి, నల్లా, వృత్తి, వ్యాపార పన్నులు, వారపు సంతలు, మార్కెట్ల నిర్వహణ, పంచాయతీకి చెందిన భవనాలు, ఖాళీ స్థలాల వంటి ఆస్తులు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి.
కేంద్ర ప్రభుత్వ నిధులు
ఐదు సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లోకి కేంద్ర ఆర్థిక సంఘం గ్రాంట్లు బదిలీ అవుతాయి. ఇవి పారిశుద్ధ్యం మౌలిక వసతుల కల్పనకు ఉపయోగపడతాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులకు, కూలీల వేతనాలకు నిధులు అందుతాయి. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా గ్రామ పారిశుద్ధ్య, ఘన వ్యర్థాల నిర్వహణకు నిధులు కేటాయిస్తారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి పథకాలతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరవుతాయి. కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ ద్వారా శుద్ధమైన తాగునీటి సరఫరాకు నిధులు విడుదల చేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి..
రాష్ట్ర ప్రభుత్వం స్టాంపు డ్యూటీ వాటా చెల్లిస్తుంది. భూముల కొనుగోలు, రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే స్టాంపు డ్యూటీలో కొంత వాటాను పంచాయతీలకు అందిస్తుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు అభివృద్ధి, నిర్వహణ ఖర్చుల కోసం ప్రభుత్వం సాధారణ గ్రాంట్లు విడుదల అవుతాయి. ప్రత్యేక అవసరాల కోసం ముఖ్యమంత్రి హామీల అమలుకు, ఇతర కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది.
గ్రామ పంచాయతీ ఖర్చులను మూడు రకాలుగా పరిశీలించవచ్చు. కార్యాలయ నిర్వహణ, పాలనా వ్యయాలు, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పచ్చదనం నిర్వహణ, సామాజిక కార్యక్రమాలకు నిధులు వ్యయం చేస్తారు. ప్రజలు కేంద్ర ప్రభుత్వ ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్ ద్వారా పంచాయతీకి కేటాయించిన బడ్జెట్, ఖర్చుల వివరాలు, ఆడిట్ నివేదికను సులభంగా పరిశీలించవచ్చు. ఇది గ్రామాభివృద్ధిలో జవాబుదారీ తనాన్ని పెంచుతుంది.


