గౌరవెల్లి ప్రాజెక్టుకు ‘బొమ్మ’ పేరు పెట్టాలి
హుస్నాబాద్: గౌరవెల్లి ప్రాజెక్టుకు మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు పేరు పెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విజ్ఞప్తి చేస్తామని కాంగ్రెస్ నాయకులు అన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బొమ్మ వెంకటేశ్వర్లు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టు బీజం పడింది వెంకటేశ్వర్లు కృషి వల్లేనని కొనియాడారు. ఈ ప్రాంతంలో బస్ డిపో, కోర్టు, డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు విశేషంగా కృషి చేశారన్నారు. పేద ప్రజల అభ్యున్నతికి తోడ్పాటును అందించారన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర హౌస్ ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు.


