జాలిగామలో ఉద్రిక్తత
గజ్వేల్‌రూరల్: గజ్వేల్ మండలం జాలిగామలో గురువారం జరిగిన ఎన్నికల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఓటర్లను ప్రలోభ పెడుతూ ప్రచా రం నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి తాళ్ల లావణ్య భర్త నవీన్‌గౌడ్‌ను, 4వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కరుణాకర్ భార్య అనసూయలను అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా పోలింగ్ కేంద్రం సమీపంలో గుంపులుగుంపులుగా వస్తుండటంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
బహిలంపూర్‌లో..
ములుగు(గజ్వేల్): మండల పరిధి బహిలంపూర్‌లో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం సమీపంలో అధికారులు నిర్దేశించిన ప్రదేశంలో వేచిఉన్న వారిని పోలీసులు అక్కడినుంచి పంపించే క్రమంలో గ్రామస్తులకు, పోలీసులకు వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని గ్రామస్తులకు నచ్చజెప్పడంతో సమస్య సద్దుమణిగింది.


