నాడు పురివిప్పి.. నేడు కళతప్పి
● నిరుపయోగంగా హరిత హోటల్
● ఏడాదిగా ‘మహతి’లో కార్యక్రమాలు నిల్
● అధికారుల నిర్లక్ష్యమే కారణమా?
గజ్వేల్: పర్యాటక ఆతిథ్యం.. వెలవెలబోతోంది. కొన్నేళ్లుగా ఓ వెలుగు వెలిగిన ఈ శాఖకు చెందిన హరిత హోటల్ నిరుపయోగంగా మారింది. మరోవైపు రవీంధ్రభారతిని తలదన్నే రీతిలో గజ్వేల్‌లో నిర్మించిన మహతి ఆడిటోరియం సైతం మునుపటి కళను కోల్పోయింది. ఏడాదిగా ఈ ఆడిటోరియంలో కార్యక్రమాలే సాగడంలేదు. ఎట్టకేలకు వారం క్రితం టెండర్ ద్వారా నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే యోచనలో ఉన్నారు.
గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో రాజీవ్‌రహదారి పక్కన 2007లో అప్పటిమంత్రి డాక్టర్ జే.గీతారెడ్డి చొరవతో ఎకరం పది గుంటల విశాలమైన స్థలంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హరిత హోటల్ నిర్మించారు. ఈ హోటల్ గడిచిన మూడేళ్ల క్రితం వరకు ఓ వెలుగు వెలిగింది. ప్రజ్ఞాపూర్‌లో రింగు రోడ్డు అందుబాటులోకి రావడంతో.. బైపాస్ నుంచే వాహనాలు వచ్చివెళుతున్నాయి. ఫలితంగా హరిత హోటల్ నిర్మించిన ప్రదేశంలో వాహనాల రాకపోకలు తగ్గుముఖం పట్టాయి. దీంతో హోటల్ కళ తప్పింది. నిర్వహణ భారంగా మారటంతో మూసేయడంతో నిరుపయోగంగా మారింది. దీని తర్వాత సంబంధిత అధికారులు ఇంతటి విలువైన భవనాన్ని వినియోగంలోకి తేచ్చే ప్రత్యామ్నాయమార్గాలను ఆలోచించకపోవడంతో పార్కింగ్‌కు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.
‘మహతి’కి టెండర్ పూర్తి..
గజ్వేల్ పట్టణంలో రూ.19.5కోట్ల వ్యయంతో మహతి ఆడిటోరియం నిర్మించారు. 2019 డిసెంబర్ 11న అందుబాటులోకి వచ్చింది. ఇందులో రెండు ఫంక్షన్ హాల్స్ ఉండగా.. ప్రధాన హాలులో వీఐపీ సీట్లతో కలుపుకొని 1100 సీట్ల సామర్థ్యం, రెండో మినీ హాలును 250 సీట్ల సామర్థ్యంతో నిర్మించారు. ఈ ఆడిటోరియం కూడా ఏడాది క్రితం వరకు ఓ వెలుగువెలిగింది. కానీ ఏడాదిగా ఇందులో కార్యక్రమాలు జరగడం లేదు. ఎట్టకేలకు వారం క్రితం టెండర్ ద్వారా ప్రైవేటు వ్యక్తులు ఈ మహతిని నిర్వహించడానికి ముందుకొచ్చారు. అగ్రిమెంట్ కావాల్సి ఉంది. అన్ని హంగులతో నిర్మించిన ఈ భవనాన్ని టూరిజం శాఖ స్వయంగా నిర్వహిస్తే.. మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉండేది. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. మరో విషయం ఏమిటంటే ఇంత గొప్పగా నిర్మించిన ఆడిటోరియానికి ప్రస్తుతమున్న రెండెకరాల స్థలంతోపాటు మరో 2ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ అవసరముంటుంది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు ముందుగానే అంచనా వేశారు. ఆడిటోరియానికి ఆనుకుని ఉన్న పాల శీతలీకరణ కేంద్రం స్థలాన్ని ఇందుకోసం తీసుకోవాలని అనుకున్నారు. ఈ కేంద్రాన్ని రాజిరెడ్డిపల్లి వైపున ఉన్న ప్రభుత్వ స్థలంలోకి మార్చాలని కూడా ప్రతిపాదించారు. కానీ.. ఈ వ్యవహారంలో ఇంకా స్పష్టత రాలేదు. భారీ కార్యక్రమాలు జరిగే సందర్భంలో ఇక్కడ కచ్చితంగా పార్కింగ్ సమస్యలు తలెత్తే అవకాశముంది. మరోవైపు ఆడిటోరియంను మరింత సుందరంగా తీర్చిదిద్దే క్రమంలో అదనంగా రూ. 2.06కోట్ల నిధులు కావాలని పర్యాటక శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో మినీ హాల్‌లో సీట్ల ఏర్పాటు, అదనంగా రెండు లిఫ్ట్‌లు, ఆడిటోరియం అద్భుతంగా చూపరులను ఆకట్టుకునే విధంగా లైటింగ్, ప్రొజెక్టర్ తదితర పనులను ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలు ముందుకుసాగకపోవడం వల్ల కూడా ‘మహతి’ కళ తప్పిందని చెప్పొచ్చు.
ఉన్నతాధికారులకు నివేదిస్తాం
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని హరిత హోటల్ అంశం ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది. ఇకపోతే మహతి ఆడిటోరియం నిర్వహించడానికి వారం క్రితం టెండర్‌లో ఒకరు ముందుకొచ్చారు. ఆడిటోరియం ఎప్పటిలాగే వినియోగంలోకి తెస్తాం. ఇతర అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఉన్నతాధికారులకు నివేదిస్తాం.
– రమేశ్‌నాయక్, ఏజీఎం, టూరిజం శాఖ
నిరుపయోగంగా హరిత హోటల్
ఏడాదిగా కార్యక్రమాలు జరగని మహతి ఆడిటోరియం
నాడు పురివిప్పి.. నేడు కళతప్పి


